Share News

తేనె తేటల తెలుగు

ABN , Publish Date - Aug 28 , 2026 | 11:19 PM

దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు ఖ్యాతిని నలుదిశలా చాటి చెప్పిన మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు. గ్రాంధిక భాషలోని తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చి వ్యావహారిక భాష అందాన్ని చాటి చెప్పిన మహనీయుడు గిడుగు రామమూర్తి పంతులు.

   తేనె తేటల తెలుగు
గిడుగు వెంకటరామ్మూర్తి

- వ్యావహారిక భాషకు ఆధ్యుడు గిడుగు

- తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర

- నేడు తెలుగు భాషా దినోత్సవం

ఆత్మకూరు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు ఖ్యాతిని నలుదిశలా చాటి చెప్పిన మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు. గ్రాంధిక భాషలోని తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చి వ్యావహారిక భాష అందాన్ని చాటి చెప్పిన మహనీయుడు గిడుగు రామమూర్తి పంతులు. ఏళ్ల పాటు శరమించి సవర భాషలో పుస్తకాలు రాసి తెలుగు గొప్పదనాన్ని సామాన్యులకు చేరువ చేశారు. తెలుగు వాడుక భాషోద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన గిడుగు రామమూర్తి పంతులు తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోయారు. తెలుగు వ్యవహారిక భాషావ్యాప్తికి ఎనలేని కృషి సాగించిన గిడుగు గ్రాంధిక భాషావాదుల పాలిట పిడుగు అన్న ప్రశంసలు అందుకున్నారు. తెలుగు భాషకు జీవం పోసిన ఆ మహనీయుడి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తోంది.

శిష్ట వ్యవహారిక పేరిట వాడుక భాషలో బోధనకు గిడుగు రామమూర్తి పెద్దపీట వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో 1863 ఆగస్టు 29వ తేదిన వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు జన్మించారు. 1875లో తండ్రి మరణించే వరకు పర్వతాలపేటలో చదువుకున్న ఆయన ఆ తర్వాత విశాఖలోని తన మేనమామ వద్ద వుంటూ ఉన్నత విద్యను పూర్తిచేశాడు. చదువుతున్న రోజుల్లోనే ముఖలింగ దేవాలయం శాసనాలను సొంతంగా చదివి అర్థం చేసుకున్నారు. 1879లో మెట్రిక్యూలేషన్‌ పాసైన తర్వాత ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ.. మిగతా విద్యను కొనసాగించారు. కాగా 1886 నాటికి ఎఫ్‌ఏ, 1896 నాటికి బీఏ పూర్తి చేశారు. విజయనగరం జిల్లాలోని గణపతి మహారాజు పాఠశాల, కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. తెలుగుభాషా బోధన వ్యావహారికంలో చేయాలన్న ఆయన ఆలోచనకు 1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్స్‌పెక్టర్‌గా వచ్చిన జేఏ.యేట్స్‌ అనే ఆంగ్లేయుడి నుంచి మద్దతు లభించింది. అప్పటి ఏవీఎస్‌ కళాశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస అయ్యంగార్‌, గురజాడ అప్పారావు, యేట్స్‌, గిడుగు రామమూర్తి పంతులు కలిసి వ్యవహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుట్టారు. అప్పటికే రామ్మూర్తి వ్యవహారిక భాషలో బోధన కోసం ప్రచారం చేసేవారు. ఇందుకోసం తెలుగు అనే పత్రికను గిడుగు ప్రారంభించారు. ఆయన కృషి కారణంగా 1912-13 సంవత్సరంలో పాఠశాల ఫైనల్‌బోర్డు తెలుగు వ్యాసపరీక్షను గద్యంలో లేదా వ్యావహారిక భాషలో రాయవచ్చునని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి స్కూల్‌, కళాశాల పాఠ్యపుస్తకాలు వ్యవహారిక భాషలో వెలువడటం మొదలుపెట్టాయి. ఆ తర్వాత ప్రభుత్వం వేసిన ఓ కమిటీలో గ్రాంధికవాదుల ఆధిపత్యంలో వ్యావహారిక భాషలో బోధనలు రద్దు చేసినా.. అనంతర కాలంలో పునరుద్ధరించారు. ఉత్తరాంధ్ర అడవుల్లో సవరులు తెలుగు భాషను నేర్చుకుని దానికి లిపిని రూపొందించి అందులో వారికి బోధించారు. దీంతో మద్రాసు ప్రభుత్వం గిడుగు తెలుగువ్యాకరణాభాషాభివృధ్ది కోసం చేసిన సేవలను గుర్తించి రావుబహుదూర్‌ బిరుదునివ్వగా, 1933లోబ్రిటీష్‌ ప్రభుత్వం కైజర్‌ - ఈ - హిందూ బిరుదు ఆయనకు ఇచ్చి గౌరవించింది. అదేవిధంగా 1936లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు. వ్యవహారిక భాషకు ఎనలేని సేవలందించిన గిడుగు రామ్మూర్తి 1940 జనవరి 22న కన్నుమూశారు.

తెలుగు భాషను విస్మరించడం దురదృష్టకరం

- విద్యాసాగర్‌, తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆత్మకూరు

నేటి సమాజంలో తెలుగు భాషను విస్మరించడం దురదృష్టకరం. దేశ భాషలెందు తెలుగు లెస్స అంటూ విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు తెలుగుభాషా కీర్తిని చాటిచెప్పగా వ్యవహారక భాషా ఉద్యమంతో తెలుగు భాషా గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా గిడుగు రామూర్తి పంతులు తీసుకెళ్లారు. ఇంతటి గొప్ప చరిత్ర వున్న తెలుగు వ్యావహారిక భాషకు నేడు ఆదరణ లేకపోవడం బాధాకరం.

భాషాభివృద్ధికి గిడుగు కృషి మరువలేనిది

- డాక్టర్‌ వేమ సుజాత, తెలుగు అధ్యాపకురాలు, ఆత్మకూరు

తెలుగు వ్యావహారిక భాషా అభ్యున్నతికి గిడుగు రామమూర్తి చేసిన కృషి ఎనలేనిది. ఒకప్పడు ప్రాచీన సాహిత్యంతో కూడిన తెలుగు గ్రాంధీక భాష చాలామందికి అర్థమయ్యేది కాదు. ఈ ఇబ్బందులను గుర్తించిన గిడుగు రామ్మూర్తి అర్థం లేని భాష వ్యర్థం అన్న నానుడితో తెలుగు వ్యావహారిక భాషాభివృద్ధికి పూనుకున్నారు.

Updated Date - Aug 28 , 2026 | 11:19 PM