Share News

మహిళా కానిస్టేబుల్‌కు హోంమంత్రి సత్కారం

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:12 AM

రాత్రి వేళ తన చంటి బిడ్డను ఎత్తుకొని... తన పరిధి కానప్పటికీ ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు కష్టపడిన మహిళా కానిస్టేబుల్‌ జయశాంతిని హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించి, సత్కరించారు.

మహిళా కానిస్టేబుల్‌కు హోంమంత్రి సత్కారం

రంగంపేట, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రాత్రి వేళ తన చంటి బిడ్డను ఎత్తుకొని... తన పరిధి కానప్పటికీ ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు కష్టపడిన మహిళా కానిస్టేబుల్‌ జయశాంతిని హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించి, సత్కరించారు. గురువారం విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో జయశాంతికి మంత్రి పట్టు వస్త్రాలు ఇచ్చి, ఆమె కుటుంబ సభ్యులతో అల్పాహారం చేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో పని చేస్తున్న జయశాంతి... ఇటీవల సామర్లకోటలో అంబులెన్స్‌ కోసం ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అనిత ఆమెకు ఫోన్‌ చేసి అభినందించారు. ‘మిమ్మల్ని కలవాలని ఉంది’ అని జయశాంతి పేర్కొనగా మంత్రి అనిత సానుకూలంగా స్పందించారు. తన ఇద్దరు పిల్లలు, ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న భర్తతోపాటు జయశాంతి హోంమంత్రి నివాసానికి వచ్చారు. నిబద్ధతతో పనిచేసే పోలీస్‌ సోదరీమణులపై తనకు ప్రత్యేక గౌరవం ఉంటుందని, ప్రతి పోలీస్‌ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అనిత భరోసా ఇచ్చారు.

Updated Date - Jan 23 , 2026 | 05:16 AM