Share News

డీఎస్సీలో అక్రమాలు.. ఏ ఆత్మ చెప్పింది?

ABN , Publish Date - Jun 04 , 2026 | 04:48 AM

డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్పిందని వైసీపీ నేతలను హోం మంత్రి అనిత ప్రశ్నించారు. 9 నెలల తర్వాత విష ప్రచారం మొదలెట్టారని మండిపడ్డారు.

డీఎస్సీలో అక్రమాలు.. ఏ ఆత్మ చెప్పింది?

  • 9 నెలల తర్వాత విష ప్రచారమా: అనిత

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్పిందని వైసీపీ నేతలను హోం మంత్రి అనిత ప్రశ్నించారు. 9 నెలల తర్వాత విష ప్రచారం మొదలెట్టారని మండిపడ్డారు. బ్రిడ్జి స్పోర్ట్స్‌ను కేంద్రం అథరైజ్డ్‌ చేసిందని, ఆయితే ఆ కోటాలో ఎవరికీ ఉద్యోగం ఇవ్వలేదని తెలిపారు. ‘‘పేకాట ఆడినోళ్లకు టీచర్‌ ఉద్యోగం ఇస్తారా?.. అని బీకాంలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ చదువుకున్న నేతలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ల హయాంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిని మద్యం దుకాణాల ముందు నిలబెట్టిన విషయం మర్చిపోయారా?.’’ అని నిలదీశారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆమె మాట్లాడారు. ‘‘బట్ట కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే పరిస్థితుల్లో లేం. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్‌ కేసులు తప్పవు’’ అని హెచ్చరించారు. డీఎస్సీ-2025ను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కనీసం ఒక్క డీఎస్సీని కూడా నిర్వహించలేదని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఎన్నో డీఎస్సీలను నిర్వహించారన్నారు. రాష్ట్రంలో సుమారు 3.11 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటే వారిలో దాదాపు 2 లక్షల మంది ఉపాధ్యాయులు ఆయన హయాంలోనే ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ‘‘నేను కూడా 2001లో డీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించా. 12 ఏళ్ల తర్వాత రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చా. డీఎస్సీ నోటిఫికేషన్‌, ఎంపిక ప్రక్రియ, పోస్టింగ్స్‌ ఎలా జరుగుతాయో నాకు తెలుసు. ఎక్కడా అవినీతికి తావులేదు. డీఎస్సీ 2025ను 240 కేసులకుపైగా దాటుకుని 148 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 16,347 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. డీఎస్సీపై 3 స్థాయిల్లో గ్రీవెన్సు నిర్వహించి, గ్రీవెన్స్‌లో 34 వేలకుపైగా ఫిర్యాదులు వస్తే వాటిని పరిష్కరించాం. ఏ కోర్టు కేసు అడ్డంకి రాకుండా అన్ని సమస్యలు పరిష్కరించి గౌరవ ప్రదంగా నియామకపత్రాలు అందజేశాం.’’ అని చెప్పారు. డీఎస్సీపై వైసీపీ నేతలు ఆది నుంచి విష ప్రచారమే చేశారన్నారు. ‘‘ఇప్పుడు క్రీడా కోటా అంటూ గొడవ చేస్తున్నారు. స్పోర్ట్స్‌ కోటా కింద 3 శాతం రిజర్వేషన్‌ కల్పించాం. ఈ రిజర్వేషన్‌లో 421 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తే 382 మందిని అర్హులుగా గుర్తించాం. ఎంపికైన వారి సర్టిఫికెట్లు పబ్లిక్‌ డొమైన్‌లో కూడా పెట్టాం. అవసరమైతే వాటిని పరిశీలించుకోవచ్చు. స్పోర్ట్స్‌ కోటా అయినా విద్యార్హతలు మాత్రం తప్పనిసరి. అవి కూడా 15 మంది సభ్యుల బృందం పరిశీలించి ఎంపిక చేసింది’’ అని అన్నారు.


బ్రిడ్జి అంటే పేకాట క్లబ్‌ కాదు

గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఆధారంగానే గ్రామ సచివాలయ నియామకాలు జరిగాయని అనిత చెప్పారు. బ్రిడ్జి స్పోర్ట్స్‌ అంటే ఆ పార్టీ నేతలు నిర్వహించే పేకాట క్లబ్‌లు కాదన్నారు. ఈ స్పోర్ట్స్‌లో ఏషియన్‌ గేమ్స్‌లో ఇండియాకు కాంస్య పతకం వచ్చిందని తెలిపారు. అయితే, డీఎస్సీలో ఈ క్రీడ కింద ఎవ్వరినీ ఎంపిక చేయలేదన్నారు. విద్యా మంత్రిగా చేసిన బొత్స సత్యనారాయణ కూడా బ్రిడ్జి గురించి తెలియకుండా మాట్లాడటమేంటని ప్రశ్నించారు.

Updated Date - Jun 04 , 2026 | 04:48 AM