మహిళలకు ‘శక్తి’ ఆయుధం
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:18 AM
రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లల భద్రత కోసం పోలీసు శాఖ రూపొందించిన ‘శక్తి’ యాప్ వారికి ఒక ఆయుధం. ఎన్ని స్మార్ట్ ఫోన్లు ఉపయోగించినా ఒక ఫోన్‌లో...
ఈ యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోండి: హోం మంత్రి అనిత
విజయవాడ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లల భద్రత కోసం పోలీసు శాఖ రూపొందించిన ‘శక్తి’ యాప్ వారికి ఒక ఆయుధం. ఎన్ని స్మార్ట్ ఫోన్లు ఉపయోగించినా ఒక ఫోన్‌లో మాత్రం కచ్చితంగా ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి’ అని హోం మంత్రి అనిత సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో మహిళా భద్రత వారోత్సవాలు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో సోమవారం ప్రారంభమయ్యాయి. వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించడానికి ముందు ఆమె మాట్లాడారు. ‘రాష్ట్రంలో మహిళల భద్రత కోసం 164 శక్తి టీంలు పనిచేస్తున్నాయి. రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్న మహిళా భద్రత విభాగం ఎక్కడా లేదు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విభాగం ఏర్పాటు చేసింది. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యం ఉంటుంది. మహిళ సాధికారత సాధిస్తే కుటుంబమంతా సాధించినట్టే. మహిళాభివృద్ధి దేశాభివృద్ధికి కొలమానం. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అబ్బాయిలకు తల్లిదండ్రులు తెలియజేయాలి. సంస్కృతి, సంప్రదాయాలను రక్షించుకోవడంతోపాటు ఆడపిల్లలను గౌరవించడాన్ని కూడా ఇంటి నుంచే నేర్పించాలి. నేరం జరిగిన తర్వాత బాధపడడం కంటే జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంలో ఉండాలి. సమస్య పరిష్కరించుకోవడం ఎలానో ఆడపిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. అదే వారికిచ్చే పెద్ద ఆస్తి. సమస్యను ధైర్యంగా చెప్పుకునే వాతావరణాన్ని తల్లిదండ్రులు ప్రతి ఇంట్లో కల్పించాలి. సమాజంలో మహిళా సాధికారతకు ఎన్టీఆర్ పునాది వేశారు. దాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నారు. ఒక ట్రైనీ కానిస్టేబుల్ అడిగితే రూ.4,500 స్టైఫండ్‌ను రూ.12 వేలు చేశారు’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా భద్రత విభాగం ఐజీ బి.రాజకుమారి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ తదితరులు పాల్గొన్నారు.