మత్తు రహిత ఏపీని సాధిద్దాం
ABN , Publish Date - Jun 27 , 2026 | 05:13 AM
డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
డ్రగ్స్ నిర్మూలనలో ఈగల్ దేశానికే ఆదర్శం
హోంమంత్రి వంగలపూడి అనిత
మంగళగిరి సిటీ, విజయవాడ, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మత్తు రహిత ఆంధ్రప్రదేశ్ సాధన కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా ఈగల్ టాస్క్‌ఫోర్స్ అందిస్తున్న సేవలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఈగల్ టాస్క్‌ఫోర్స్ వాడుతున్న ఆధునిక సాంకేతికత, పనితీరును చూసి ఇతర రాష్ట్రాలు ఈ మోడల్‌ను అనుసరించేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా మంగళగిరిలోని ఈగల్ ప్రధాన కార్యాలయంలో ‘మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడం, అక్రమ రవాణాను నిరోధించడమే లక్ష్యం’ అనే అంశంపై శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈగల్ అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 56 మంది అధికారులకు ‘ఈగల్ ఎక్సలెన్స్’ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ... రాష్ట్రాన్ని మత్తు రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో ప్రజల భాగస్వామ్యమే తమ బలమని చెప్పారు. మాదకద్రవ్యాల గుర్తింపు సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు డ్రగ్ టెస్టింగ్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడానికి, అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈగల్ బృందాల నిరంతర నిఘా, గంజాయి రహిత ఏపీ లక్ష్యంగా సాగుతున్న పలు ఆపరేషన్లు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయని తెలిపారు. రెండేళ్లలో సుమారు 1.20 లక్షల కిలోల గంజాయిని నాశనం చేసినట్లు వెల్లడించారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలనకై అధికారులతో కలిసి సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ, ఈగల్ ఎస్పీ మహేశ్వరరాజు, అధికారులు, ఎన్‌సీబీ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.