రైతులపై వైసీపీ రౌడీ మూకల దాడి
ABN , Publish Date - Jun 28 , 2026 | 05:44 AM
వైసీపీ నేతలకు అమరావతిలో పర్యటించే నైతిక అర్హత లేదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు.
నాడు టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారే
నేడు అమరావతిలో రైతులపైకి వెళ్లారు
దీనిపై ప్రభుత్వం సీరియ్‌సగా ఉంది...
పూర్తి స్థాయి విచారణ చేస్తాం: హోం మంత్రి అనిత
అమరావతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలకు అమరావతిలో పర్యటించే నైతిక అర్హత లేదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ నాయకులు రాజధాని రైతులను పరామర్శించడానికి వెళ్లారా? లేక రాజధానిలో రౌడీయిజం చేయడానికి వెళ్లారా? వైసీపీ నేతలు రాజధాని ప్రాంతానికి వెళితే సమస్య వస్తుందని పోలీసులు ముందస్తు సమాచారం ఇచ్చినా కవ్వింపు చర్యల కోసమే వారు ఆ ప్రాంతంలో పర్యటించారు. వైసీపీ నేతలు వెళ్లిన పెనుమాకలో 90 శాతం రైతులు రాజధానికి భూములు ఇచ్చారు. రైతులపై రౌడీయిజం చేయడానికి గుండాలను వెంటబెట్టుకుని వెళ్లిన వైసీపీ నేతలు ఇప్పుడు రైతులే తప్పు చేసినట్టు మాట్లాడటం సరికాదు. వైసీపీ నేతల వెంట వెళ్లిన వారిలో ఎంత మంది రౌడీషీటర్లు ఉన్నారో పోలీసుల వద్ద మొత్తం సమాచారం ఉంది. ఆనాడు టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన రౌడీలే నేడు రాజధాని రైతులపై దాడికి వచ్చారు. వారందరి విజువల్స్ మా దగ్గర ఉన్నాయి. అమరావతిలో పర్యటించింది వైసీపీ బృందమా? లేక వైసీపీ రౌడీ బృందమా? అన్నది నిగ్గు తేలుస్తాం. శనివారం జరిగిన ఘటన ముమ్మాటికీ అమరావతి రైతులపై రౌడీ మూకలు చేసిన దాడే. వైసీపీ అంటే కడుపు మంటతో ఉన్న అమరావతి రైతులే వైసీపీ నాయకులను అడ్డుకున్నారు. అక్కడ టీడీపీ కార్యకర్తలు ఎవ్వరూ లేరు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియ్‌సగా తీసుకుంటుంది. పూర్తి స్థాయి విచారణ చేస్తుంది. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపైనా విచారణ చేస్తాం’ అని అనిత ప్రకటించారు.