అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వాలి’
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:17 PM
వేసవిని దృష్టిలో పెట్టుకుని మే నెలంతా అంగన్‌వాడీలకు సెలవులను మంజూరు చేయాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి లక్ష్మి, సీఐటీయూ మండల కార్యదర్శి రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పత్తికొండ టౌన్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): వేసవిని దృష్టిలో పెట్టుకుని మే నెలంతా అంగన్‌వాడీలకు సెలవులను మంజూరు చేయాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి లక్ష్మి, సీఐటీయూ మండల కార్యదర్శి రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సీడీపీవో కార్యాలయం ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 23నుంచి మార్చి 2వరకు అంగన్‌వాడీల సమస్యలపై దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. అయితే నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు జీతాలు కట్ చేయడం శోచనీయమన్నారు. సెంటర్లను నడుపుకుంటూనే దీక్షలు, నిరసన కార్యక్రమాల్లో అంగన్‌వాడీలు పాల్గొన్నారన్నారు. అలాంటప్పుడు వేతనాలు కట్ చేయడం సమంజసం కాదన్నారు. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకురాళ్లు లక్ష్మిదేవి, రామలక్ష్మి, మారుతమ్మ, అరుణమ్మ, లక్ష్మిబాయి తదితరులు పాల్గొన్నారు.
కనీస వేతనం ఇవ్వాలి
ఆలూరు రూరల్: అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్‌కు కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నాయకురాలు ప్రభావతి కోరారు. మంగళవారం సాయంత్రం సీఐటీయూ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ ప్రాజెక్టులో సీడీపీవో నరసమ్మకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కేపీ నారాయణస్వామి, అంగన్‌వాడీ వర్కర్స్ నాయకురాళ్లు బాలరంగమ్మ, సరస్వతి, సుజాతమ్మ, రాజేశ్వరి, లక్ష్మి, భారతి పాల్గొన్నారు.