‘హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్’
ABN , Publish Date - May 21 , 2026 | 04:58 AM
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా, ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ‘హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్...
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రచారానికి శ్రీకారం: మంత్రి దుర్గేశ్
అమరావతి, మే 20(ఆంద్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా, ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ‘హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో శ్రీకారం చుట్టిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. గతేడాది దేశం నుంచి 3.4 కోట్ల మంది విదేశీ పర్యటనలకు వెళ్లగా, మన దేశానికి 90 లక్షల మంది మాత్రమే విదేశీ పర్యాటకులు వచ్చారని వివరించారు. ఆ ధోరణిలో మార్చు తీసుకువచ్చి, దేశీయ పర్యాటకానికి ఆదరణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ‘హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన తెలుగు ప్రజలు ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ప్రవాస తెలుగు కుటుంబం కనీసం ఐదు విదేశీ కుటుంబాలను రాష్ట్ర పర్యాటనకు ఆహ్వానించాలని కోరారు.