ప్రియుడు దక్కలేదని.. హెచ్‌ఐవీ ఇంజెక్షన్
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:57 AM
తెలంగాణ రాష్ట్రం ఇల్లెందులో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా వచ్చింది. తనకు నచ్చని వ్యక్తిని ప్రేమించిందన్న కోపంతో హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తాన్ని...
డాక్టర్ భార్యకు ప్రాణాంతక రక్తాన్ని ఎక్కించిన నర్సు
కర్నూలులో నిర్ఘాంతపోయే ఘటన
సినిమా సీన్ తలపించేలా నాటకం
స్కూటీని ఢీకొట్టి సాయం చేస్తున్నట్లు డ్రామా
ఇంజక్షన్ చేసి అక్కడి నుంచి పరారీ
కర్నూలు క్రైం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం ఇల్లెందులో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా వచ్చింది. తనకు నచ్చని వ్యక్తిని ప్రేమించిందన్న కోపంతో హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తాన్ని కన్న కుమార్తెకు తండ్రి ఇంజెక్షన్ చేయడం ఆ సినిమా ప్రధాన ఇతివృత్తం. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగింది. అయితే ఇక్కడ ఇంజక్షన్ చేసిన వ్యక్తి తండ్రి కాదు. అసూయతో రగిలిపోయిన ఓ మహిళ ఈ ఘోరానికి పాల్పడింది. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో సాటి మహిళకు హెచ్‌ఐవీ రక్తాన్ని ఇంజెక్షన్ చేసింది. సభ్య సమాజం నిర్ఘాంత పోయేలా ఉన్న ఆ ఘటనకు సంబంధించిన వివరాలను శనివారం సాయంత్రం కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 9వ తేదీన మధ్యాహ్న సమయం లో మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా డాక్టర్ స్కూటీపై ఇంటికి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చి ఢీకొట్టారు. ఆ డాక్టర్ కిందపడిపోవడంతో అక్కడే ఉన్న ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి సాయం చేస్తున్నట్లు నటించి ఆటో ఎక్కిస్తామని చెప్పి ఆ సమయంలో ఆ మహిళా డాక్టర్‌కు ఓ ఇంజక్షన్ చేశారు. ఆ మహిళా డాక్టర్ గట్టిగా కేకలు వేయగా, వారు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే ఆ వైద్యురాలు భర్తకు సమాచారం ఇచ్చింది. తనపై విష ప్రయోగం జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ కెమెరాలు, సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఆ సమయంలో నలుగురు నిందితులు అక్కడ ఉన్నట్లుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. బీచుపల్లి బోయ వసుంధర అలియాస్ వేదవతి (కర్నూలు), కొంగె జ్యోతి (ఆదోని), భూమా జశ్వంత్ (మంత్రాలయం), భూమా శృతి (మంత్రా లయం)లను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకు న్నారు. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల్లో వసుంధర అనే మహిళ నర్సుగా పని చేస్తోంది. ఆమె గతంలో ఓ డాక్టర్‌ను ప్రేమించింది. అయితే ఆ డాక్టర్ వసుంధరను కాదని వైద్యురాలిని పెళ్లి చేసుకు న్నాడు. దీంతో వసుంధర తన ప్రియుడిని పెళ్లి చేసుకున్న వైద్యురాలిపై ద్వేషం పెంచుకుంది. ఆ వైద్యురాలికి హెచ్‌ఐవీ ఇంజెక్షన్ చేయాలని ప్లాన్ వేసింది. ఇందుకు ఆమె ఇతర నిందితుల సహకారం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెచ్‌ఐవీ పేషెంట్ల నుంచి ఇతర నర్సుల సహకారంతో హెచ్‌ఐవీ వైరస్‌తో కూడిన రక్తాన్ని సేకరిం చింది. ఆ రక్తాన్ని సదరు వైద్యురాలిపై ఇంజెక్షన్ రూపంలో ప్రయోగించింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హెచ్‌ఐవీ పేషెంట్ల రక్తాన్ని ఇచ్చిన నర్సులపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో కర్నూలు త్రీటౌన్ సీఐ శేషయ్య, ఎస్‌ఐలు బాలనరసింహులు, ఆశాలత తదితరులు ఉన్నారు.