Share News

ఎవరెస్టు యాత్ర మృతుల్లో హిందూపురం టెకీ

ABN , Publish Date - May 25 , 2026 | 05:36 AM

సాహస యాత్ర విషాదం నింపింది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లిన వారిలో ఏపీకి చెందిన ఓ వ్యక్తితో పాటు మరొకరు మరణించారు.

ఎవరెస్టు యాత్ర మృతుల్లో హిందూపురం టెకీ

  • తల్లిదండ్రులకు తెలియకుండా అమెరికా నుంచి భారత్‌ వచ్చిన సందీప్‌

  • గ్లౌ, కళ్లద్దాలు తీయడంతో తీవ్ర అనారోగ్యం

బెంగళూరు, మే 24 (ఆంధ్రజ్యోతి): సాహస యాత్ర విషాదం నింపింది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లిన వారిలో ఏపీకి చెందిన ఓ వ్యక్తితో పాటు మరొకరు మరణించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన సందీప్‌ ఆరె (46) ఒకరు కాగా, మరొకరు అరుణ్‌కుమార్‌ తివారీ (53) యూపీ వాసి అయినప్పటికీ, తెలంగాణలోని హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేస్తున్నారు. సందీప్‌ అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌లో ఐటీ ఉద్యోగిగా స్థిరపడ్డారు. యాత్రలో భాగంగా సందీప్‌ ఈ నెల 20న ఎవరెస్టు శిఖరంపైకి విజయవంతంగా చేరుకున్నారు. అక్కడ జాతీయ జెండాతో ఫొటోలు తీసుకునే క్రమంలో చేతికి ఉన్న గ్లౌ, కళ్లద్దాలు తీసేశారు. ఎక్కువ సేపు వాటిని తిరిగి ధరించకపోవడంతో కంటిచూపు దెబ్బతింది. తీవ్ర అలసటకు లోనయ్యారు. మెదడులోకి ద్రవాలు చేరి ఇబ్బంది పడ్డారు. రెస్క్యూ బృందం రాత్రంతా శ్రమించి గురువారం క్యాంప్‌-2 వద్దకు తీసుకురాగా సందీప్‌ కన్నుమూశారు. సందీప్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. కాగా, సందీప్‌ అమెరికా నుంచి భారత్‌కు వచ్చే విషయంలో గోప్యత పాటించినట్లు సమాచారం. వాస్తవానికి ఈ నెల 22, 23 నాటికి బెంగళూరు సహకార నగర్‌లో నివసించే తల్లిదండ్రుల వద్దకు సందీప్‌ చేరుకోవాల్సి ఉంది. అదే రోజున మీడియాలో ఎవరెస్టు అధిరోహణ విషయం ప్రసారమయ్యేలా ప్రణాళిక వేసుకున్నారు. వాటిని తల్లిదండ్రులకు చూపి ఆశ్చర్యం కలిగించాలని భావించారు. అమెరికాలోనే ఉన్నాడని భావించామని, ఇంతటి దారుణం జరుగుతుందని ఊహించలేదని సందీప్‌ తండ్రి నారాయణస్వామి అన్నారు. సందీప్‌ పార్థివ దేహం 2-3 రోజుల్లో బెంగళూరుకు చేరుకునే అవకాశం ఉందన్నారు.

Updated Date - May 25 , 2026 | 05:37 AM