‘కల్తీ’ బాధ్యత గత ప్రభుత్వానిదే
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:21 AM
తిరుమల లడ్డూ వివాదంపై హిందూ ధర్మ ఆచార్య సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో...
ఇది హిందూ శాస్త్ర నియమాల ఉల్లంఘన
లడ్డూ కల్తీపై హిందూ ధర్మ ఆచార్య సభ తీవ్ర విచారం
అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ వివాదంపై హిందూ ధర్మ ఆచార్య సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరగడంపై ఆచార్య సభ విచారం, ఆవేదన వ్యక్తం చేసింది. స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఈ సంస్థ హిందూ ధర్మానికి అత్యున్నత నిర్ణయాధికార సంస్థగా గుర్తింపు పొందింది. ఈ సభలో వివిధ పురాతన సంప్రదాయాలకు చెందిన పీఠాలు, ఆఖాడాలు, అధీనాలు, లింగాయతుల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం హిందూ ధర్మ ఆచార్య సభకు సెక్రటరీ జనరల్‌గా, కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న స్వామి పరమాత్మానంద సరస్వతి సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. ‘కల్తీ నెయ్యి అంశం హిందూ సమాజ భావోద్వేగాలను గాఢంగా దెబ్బతీసింది. శాస్త్ర ప్రకారం నైవేద్యంలో కేవలం స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే వాడాలి. ధార్మిక కార్యక్రమాలను పవిత్రమైన బాధ్యతగా భావించాలి. ఈ కల్తీని కేవలం ఆహార కల్తీగానే చూడకూడదు. హిందూ శాస్త్ర నియమాల ఉల్లంఘనగా పరిగణించాలి. కల్తీ నెయ్యి సరఫరాకు గత ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. పవిత్రమైన బాధ్యతలను నిర్వహించడంలో నాటి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు ద్రవ్య శుద్ధి(పదార్థాల పవిత్రత)పై శాస్త్ర, ఆగమ నియమాలపై సదస్సులు, సెమినార్లు నిర్వహించాలని సభ సిఫార్సు చేస్తోంది. ధార్మిక చింతన, బాధ్యత గల వ్యక్తులు మాత్రమే టీటీడీ వ్యవహారాలు నిర్వహించేలా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. దేవాలయ నిర్వహణను పవిత్ర బాధ్యతగా దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి’ అని ఆ ప్రకటనలో స్వామి పరమాత్మానంద సరస్వతి పేర్కొన్నారు.