Share News

కంకరగా మారుతున్న కొండలు

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:40 PM

కొండలు కరిగిపోతున్నాయి.. గుట్టలు గుంతలుగా మారిపోతున్నాయి. అందంగా కనిపించే కొండలు కళ్లముందే కనుమరుగవుతున్నాయి.

   కంకరగా మారుతున్న కొండలు
వెంకటాపురంలో కొండను కరిగిస్తున్న ఎక్సవేటర్‌

తవ్వుకుంటాం...అమ్ముకుంటాం.. యథేచ్ఛగా అక్రమార్కుల చర్యలు

తరిగిపోతున్న కొండలు

పట్టించుకోని అధికారులు

ఓర్వకల్లు, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): కొండలు కరిగిపోతున్నాయి.. గుట్టలు గుంతలుగా మారిపోతున్నాయి. అందంగా కనిపించే కొండలు కళ్లముందే కనుమరుగవుతున్నాయి. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. యథేచ్ఛగా అక్రమార్కులు ఇసుక, కంకర రూపాల్లో గుట్టలను ధ్వంసం చేస్తున్నారు. మండలంలోని వెంకటాపురం, సోమయాజులపల్లె, ఓర్వకల్లు, కన్నమడకల, కేతవరం, పూడిచెర్ల, భైరాపురం తదితర గ్రామాల వద్ద ఉన్న ఫ్యాక్టరీలలో రాళ్లను మిషన్లలో పగులకొడుతున్నారు. ఇలా వచ్చిన ఇసుకను వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే కంకరను కూడా బయటి ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. సదురు వ్యక్తులు తాము ఒక సర్వే నెంబరులో అనుమతులు ఉంటే.. వేరు సర్వే నెంబరులో కూడా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. రాయల్టీలు చెల్లించకుండానే ఇసుక, కంకర రవాణా సాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారని, అయితే.. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఫ్యాక్టరీలకు అనుమతులు ఇచ్చారని ఈ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక ఫ్యాక్టరీల వల్ల సమీపాల్లో ఉన్న పొలాల్లో వేసిన పంటలు దుమ్ము ధూళితో పంటల పెట్టుబడి రాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. కొండలు కంకర, ఇసుక రూపాల్లో తరిగిపోతున్నా మైనింగ్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రకృతికి తీవ్రమైన నష్టం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. పైగా ప్రభుత్వానికి రూ. లక్షల్లో గండి కొడుతున్నారని, వాటిపై అధికారులు విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

ఫ అనుమతులు లేని ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలి- రామకృష్ణ, సీపీఎం నాయకుడు

మండలంలో అనుమతులు లేని ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలి. వీటి నుంచి వచ్చే దుమ్మూ ధూళితో పంటలు నాశనం అవుతున్నాయి. అయినా అధికారులు స్పందించడం లేదు. తక్షణమే విచారణ జరిపి అనుమతులు లేని ఫ్యాక్టరీలను సీజ్‌ చేయాలి.

ఫ విచారణ చేపడుతాం- విద్యాసాగర్‌, తహసీల్దార్‌, ఓర్వకల్లు:

మండలంలో కంకర, ఇసుక ప్యాక్టరీలు ఉన్నాయని, అనుమతులు లేని ఫ్యాక్టరీలపై విచారణ జరిపి అనుమతులు లేకుంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ ఫ్యాక్టరీలను సీజ్‌ చేస్తాం.

ఫ ఇసుక ప్యాక్టరీతో ఇబ్బందులు పడుతున్నాం - ప్రకాశం, పూడిచెర్ల రైతు!:

ఇసుక ఫ్యాక్టరీలతో ఇబ్బందిపడుతున్నాం. వాటి నుంచి వచ్చే దుమ్మూ దూళి, ఇసుక రేణువులు కళ్లలో పడుతున్నాయి. అలాగే ఇసుకపై నుంచి వచ్చే దుమ్ము పంటలపై పడి పంటలు నష్టపోతున్నాం. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.

Updated Date - Apr 25 , 2026 | 11:40 PM