Share News

హైవేపై అగ్ని కీలలు

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:24 AM

మూడు నెలల క్రితం కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అగ్నికి ఆహుతై 19 మంది సజీవదహనమయ్యారు.

హైవేపై అగ్ని కీలలు

  • అర్ధరాత్రి హైవేపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

  • టైరు పేలి.. డివైడర్‌ దాటి కంటైనర్‌ను ఢీకొన్న బస్సు

  • లారీలో చెలరేగి.. బస్సుకు వ్యాపించిన మంటలు

  • ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం.. గాయాలతో మరొకరు మృతి

  • అప్రమత్తమై ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన బస్సు అటెండర్‌

  • 36 మంది ప్రయాణికులూ సురక్షితం.. 14 మందికి గాయాలు

  • బస్సు హైదరాబాద్‌ వెళ్తుండగా నంద్యాల జిల్లాలో ఘోరం

నంద్యాల/శిరివెళ్ల, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): మూడు నెలల క్రితం కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అగ్నికి ఆహుతై 19 మంది సజీవదహనమయ్యారు. ఆ భయానక ఘటనను మరువక ముందే నంద్యాల జిల్లాలో జరిగిన మరో ఘటన తీవ్ర అలజడి రేపింది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ను దాటి రోడ్డుకు అవతలివైపు ఎదురుగావస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో కంటైనర్‌లో సంభవించిన మంటలు బస్సుకు కూడా అంటుకోవడంతో అవి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అయితే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండటంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం కాగా, మరొకరు తీవ్రంగా గాయపడి మృతిచెందారు. బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 14 మందికి స్వల్ప గాయాలయ్యాయి.


టైర్‌ పేలి.. డివైడర్‌ను దాటి..

ఏఆర్‌ అండ్‌ బీసీవీఆర్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్‌ బస్సు బుధవారం రాత్రి 8:30 గంటలకు 36 మంది ప్రయాణికులతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది. 40వ జాతీయ రహదారిపై రాత్రి 1:15 గంటలకు శిరివెళ్ల మెట్ట వద్ద బస్సు ముందు టైరు (కుడివైపు) పేలింది. దీంతో ఒక్కసారిగా అదుపుతప్పిన బస్సు.. డివైడర్‌ ఎక్కి దాదాపు వంద మీటర్ల మేర దానిమీదే ప్రయాణించింది. ఆ తర్వాత హైవేకి కుడివైపున హైదరాబాద్‌ నుంచి కడప వైపు వెళ్తున్న కంటైనర్‌ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నించగా బస్సు మెయిన్‌ డోర్‌ తెరుచుకోలేదు. దీంతో కొందరు బస్సు వెనుక వైపు ఉన్న ఎమర్జెన్సీ తలుపులను ధ్వంసం చేసి బయటపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు, శిరివెళ్లకు చెందిన కొందరు యువకులు చొరవచూపి మరికొన్ని అద్దాలు పగలగొట్టి మిగిలినవారిని కూడా బయటకు లాగారు. దీంతో బస్సులోని 36 మంది ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వైభవ్‌, హేమంత్‌, వినీత, మంజువాణి, మరికొందరిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


మంటలు ఎలక్ర్టిక్‌ స్కూటర్లకు అంటుకుని..

కంటైనర్‌ లారీ ఎలక్ట్రికల్‌ స్కూటర్ల లోడుతో బుధవారం హైదరాబాద్‌ నుంచి పోరుమామిళ్లకు బయల్దేరింది. శిరివెళ్ల మెట్ట వద్ద అదుపుతప్పిన ట్రావెల్స్‌ బస్సు.. ఈ లారీని ఢీకొట్టడంతో అది జాతీయ రహదారి నుంచి సర్వీస్‌ రోడ్డులోకి పడిపోయింది. ఈ ఘటనలో ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌, లారీ డ్రైవర్‌ వారివారి క్యాబిన్లలో ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో లారీలో మంటలు చెలరేగి ఎలక్ట్రికల్‌ స్కూటర్లకు అంటుకున్నాయి. ఆ మంటలను చూసి బస్సులోని ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. కొందరు బస్సు అద్దాలను ధ్వంసం చేసి బయటకు దూకారు. స్థానికులు, ఇతర వాహనదారులు శ్రమించి మిగిలిన వారిని బయటకు తీశారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే కంటైనర్‌ నుంచి మంటలు ట్రావెల్స్‌ బస్సుకు వేగంగా వ్యాపించాయి. మంటల తీవ్రత అధికమై బస్సు అగ్ని కీలకల్లో చిక్కుకుంది. దీంతో బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ దుస్సా ఓబులేసు అలియాస్‌ భాస్కర్‌ (47) సజీవ దహనమయ్యాడు. కంటైనర్‌ లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ నవీన్‌కుమార్‌ (25) సైతం మంటల్లో చిక్కుకుని మాంసపు ముద్దయ్యాడు. లారీలోని మరో డ్రైవర్‌ అభిషేక్‌ (25) రహదారిపైకి ఎగిరిపడడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని కంటైనర్‌ లారీ, బస్సు నుంచి ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, నంద్యాల ఎస్పీ సునీల్‌ షెరాన్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మృతులు ముగ్గురూ కడప వాసులే...

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌, లారీలోని ఇద్దరు డ్రైవర్లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ముగ్గురినీ కడప పట్టణానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బస్సు ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ దుస్సా ఓబులేసు అలియాస్‌ భాస్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Jan 23 , 2026 | 05:19 AM