హైటెక్ అవినీతి..!
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:18 AM
లంచం డిమాండ్ చేయడం... ఇచ్చిన సొమ్ముని దొంగచాటుగా జేబులో వేసుకోవడం.. పాత పద్ధతి..! ఇప్పుడంతా డైరెక్ట్. లంచాల సొమ్మును కూడా ఆన్‌లైన్‌లోనే వసూలు చేస్తున్నారు.
హైటెక్ అవినీతి..!టౌన్ ప్లానింగ్‌లో ఫోన్ పే, గూగుల్ పే ద్వారా లంచాలు
ఏసీబీ అధికారుల ఆశ్చర్యం.. 3.54 లక్షల నగదు సీజ్
అమరావతి, ఒంగోలు క్రైం, శ్రీకాకుళం, మార్చి 11(ఆంధ్రజ్యోతి): లంచం డిమాండ్ చేయడం... ఇచ్చిన సొమ్ముని దొంగచాటుగా జేబులో వేసుకోవడం.. పాత పద్ధతి..! ఇప్పుడంతా డైరెక్ట్. లంచాల సొమ్మును కూడా ఆన్‌లైన్‌లోనే వసూలు చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు విస్తృత సోదాలు చేపట్టింది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, విశాఖపట్నంలోని 3 జోనల్ కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో భారీగా అక్రమాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల వద్ద అనధికారికంగా ఉన్న రూ.2.97 లక్షల నగదు, అలాగే కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో టౌన్ ప్లానింగ్ అధికారులకు సహకరించే ముగ్గురు ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.57 వేలను స్వాధీనం చేసుకున్నారు.
కీలక డాక్యుమెంట్లు, రికార్డులు స్వాధీనం
నగరపాలక సంస్థల్లో అవినీతిపై మంగళవారం ఉదయం నుంచి ఆకస్మిక సోదాలకు దిగిన ఏసీబీ బుధవారం సాయంత్రం వరకూ వాటిని కొనసాగించిం ది. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ 13 కార్పొరేషన్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. విశాఖపట్నం కార్యాలయాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ అనుమతుల డేటా, ఫీజు వసూలు రశీదులు, అనుమతుల పెండింగ్ ఫైళ్లు, అనుమానాస్పద రికార్డులు, డైరీలు, సెల్‌ఫోన్లు, కంప్యూటర్లలో భద్రపరిచిన డేటా, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో ప్రైవేటు భవనాల నిర్మాణానికి అనుమతులిచ్చినట్లు ఏసీబీ గుర్తించింది. విశాఖలో ఎక్కువగా డ్రైనేజీ కాల్వలపై నిర్మాణాలకు అధికారులు అనుమతులిచ్చినట్లు ఏసీబీ గుర్తించింది.
వేలల్లో దరఖాస్తుల పెండింగ్..
రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లలో 80 భవనాలకు అనుమతి ధరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా నిర్మాణాల్లో ఉల్లంఘనలకు అవినీతి అధికారులు అనుమతులిచ్చినట్లు ఏసీబీ గుర్తించింది. బిల్డింగ్ పెనాల్టీ స్కీమ్(బీపీఎస్) కింద నగర కార్పొరేషన్లలో 22వేల దరఖాస్తులు వస్తే అందులో 16 వేలకు పైగా ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించింది. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎస్) కింద 15,500 దరఖాస్తులు రాగా 8,500 పెండింగ్‌లో పెట్టారు. గుంటూరు మున్సిపాలిటీలో పలువురు దరఖాస్తుదారుల నుంచి ఇంపాక్ట్ ఫీజు రూ.2.28 కోట్లు తక్కువగా వసూలు చేసినట్లు బయట పడింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కృష్ణా నదితో పాటు బందరు, ఏలూరు, కృష్ణా కాల్వలపై 4,700 అక్రమ నిర్మాణాలున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏసీబీ అధికారులు చెప్పారు. పలు చోట్ల టౌన్ ప్లానింగ్ సిబ్బంది పెండింగ్ దరఖాస్తుదారుల నుంచి గూగుల్ పే, ఫోన్ పే ఇతర డిజిటల్ లావాదేవీల ద్వారా లంచాలు వసూలు చేసినట్టు గుర్తించామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా 9440440057కు సమచారం ఇవ్వాలని ఏసీబీ డీజీ అతుల్ సింగ్ సూచించారు. ఒంగోలు నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ అధికారి, సూపర్‌వైజర్‌తోపాటు సిబ్బంది ఫోన్‌లలో రూ.50లక్షలకుపైగా లావాదేవీలు నడిచినట్లు గుర్తించారు.