Share News

ప్రతిష్టాత్మక కంపెనీలతో విజ్ఞాన్‌ ఒప్పందాలు

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:56 AM

ఒక్క క్షణం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం నిలిచిపోతే.. కమ్యూనికేషన్‌ వ్యవస్థ, బ్యాంకింగ్‌, రవాణా, వ్యవసాయం, చివరికి టీవీ చానల్స్‌ కూడా మూతపడతాయని డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌, రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు డాక్టర్‌ జి.సతీశ్‌ రెడ్డి తెలిపారు.

ప్రతిష్టాత్మక కంపెనీలతో విజ్ఞాన్‌ ఒప్పందాలు

గుంటూరు(విద్య), జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఒక్క క్షణం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం నిలిచిపోతే.. కమ్యూనికేషన్‌ వ్యవస్థ, బ్యాంకింగ్‌, రవాణా, వ్యవసాయం, చివరికి టీవీ చానల్స్‌ కూడా మూతపడతాయని డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌, రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు డాక్టర్‌ జి.సతీశ్‌ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ స్పేస్‌ టెక్‌ సమ్మిట్‌-2026 రెండో రోజు శుక్రవారం ఘనంగా కొనసాగింది. ఈ సందర్భంగా సతీశ్‌ రెడ్డి మాట్లాడుతూ, సాధారణంగా అంతరిక్షం అనగానే ఇస్రో ప్రయోగాలు, ఉపగ్రహాల గురించి మాట్లాడుకుంటామని, కానీ రక్షణ రంగంలో దీని పాత్రను విస్మరించలేమన్నారు. నేటి కాలంలో దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలవ్వగానే.. మొదటగా నిర్దేశిత ప్రాంతాలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక ఉపగ్రహాలను ప్రయోగిస్తారని తెలిపారు. సమ్మిట్‌లో భాగంగా విజ్ఞాన్‌ యూనివర్సిటీతో దేశంలోని పలు ప్రతిష్టాత్మక కంపెనీలు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో అనంత్‌ టెక్నాలజీస్‌ సీఎండీ డాక్టర్‌ పావులూరి సుబ్బారావు, ఏపీ సైన్స్‌ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు, విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, సీఈవో డాక్టర్‌ మేఘన కూరపాటి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 05:00 AM