Share News

గిరిజన సమస్యల పరిష్కారానికి హైపర్‌ కమిటీ

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:15 AM

రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు గిరిజనుల సమస్య పరిష్కారానికి హైపర్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు.

గిరిజన సమస్యల పరిష్కారానికి హైపర్‌ కమిటీ
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిషాంతి, పక్కన జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

కలెక్టర్‌ టి.నిషాంతి వెల్లడి

కమిటీ ఏర్పాటుపై వివిధ సంఘాల నేతలతో సమావేశం

పాడేరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు గిరిజనుల సమస్య పరిష్కారానికి హైపర్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, అడిషనల్‌ ఎస్‌పీ శృతిలతో కలిసి వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణిలు గత నెల 28న గిరిజన సంఘాల నేతలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో గిరిజన సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు, సంఘాల నేతలతో కలిసి హైపర్‌ కమిటీని నియమిస్తామని ప్రకటించారు. ఈ మేరకు హైపర్‌ కమిటీ ఏర్పాటుపై అధికారులు, గిరిజన సంఘాల నేతలతో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. గిరిజనులకు సంబంధించిన అంశాలపై సమగ్ర నిర్ణయాలు తీసుకునేందుకు అధికారులు, ఉన్నతాధికారులతో పాటు ఐదుగురు గిరిజన సంఘాల నేతలతో హైపర్‌ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు గాను గిరిజన నేతలను సూచించాలని కలెక్టర్‌ కోరారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బాబూరావునాయుడు, లీగల్‌ అడ్వైజర్‌ కొబ్బా శ్రీనివాస్‌ అనే ఇద్దరు పేర్లను గిరిజన సంఘాల నేతలు సూచించగా, రేపటిలోగా మరో ముగ్గురు పేర్లను సూచించాలని కలెక్టర్‌ కోరారు. అధికారులు, సంఘాల ప్రతినిధులతో ఏర్పాటయ్యే హైపర్‌ కమిటీ ద్వారానే గిరిజన ప్రాంత సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. అలాగే పలు సంఘాల నేతలు ర్యాలీ, బంద్‌లు వంటి వాటి జోలికి పోకుండా శాంతియుతంగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గిరిజనుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 12:15 AM