Share News

ఉన్నత విద్య ప్రక్షాళనలో తొలి అడుగు

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:41 AM

ఉన్నత విద్య ప్రక్షాళనలో తొలి అడుగు పడింది. ఇటీవల క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా శాఖల పునర్‌ వ్యవస్థీకరణ దిశగా అడుగులు పడ్డాయి.

ఉన్నత విద్య ప్రక్షాళనలో తొలి అడుగు

  • సాంకేతిక విద్యాశాఖ రద్దు.. బోర్డు, సిబ్బంది, ఆస్తులు ఉన్నత విద్యకు బదిలీ

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య ప్రక్షాళనలో తొలి అడుగు పడింది. ఇటీవల క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా శాఖల పునర్‌ వ్యవస్థీకరణ దిశగా అడుగులు పడ్డాయి. ఈమేరకు ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల కార్యదర్శి కోన శశిధర్‌ శుక్రవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాల విద్యా శాఖను ఉన్నత విద్య కమిషనరేట్‌గా మార్చారు. సాంకేతిక విద్యా శాఖను రద్దు చేశారు. దానికి సంబంధించిన సిబ్బంది, ఆస్తులను ఉన్నత విద్యలోకి బదిలీ చేశారు. కొత్తగా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, శిక్షణ కమిషనరేట్‌ ఏర్పాటు చేశారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి పేరును మార్చారు. ఆయా అంశాలపై ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. మరోవైపు ఉపాధి కల్పన, శిక్షణ డైరెక్టరేట్‌ను నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, శిక్షణ కమిషనరేట్‌గా మార్చారు. ఈ కమిషనరేట్‌ పరిధిలోకి నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్‌, ఓంక్యాప్‌లు వచ్చాయి. రాష్ట్రస్థాయిలో మార్పునకు అనుగుణంగా జిల్లాల్లో ఉండే ఉపాధి కల్పన అధికారి పోస్టును జిల్లా ఉపాధి కల్పన, నైపుణ్యాధికారిగా మార్చారు.

అడ్మిషన్ల బాధ్యత కమిషనరేట్‌కే...

కమిషనరేట్‌ ఏర్పాటుతో ఉన్నత విద్యామండలి అధికారాలు పరిమితం కాను న్నాయి. ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యత మండలిదే. అయితే అడ్మిషన్లన్నీ ఉన్నత విద్య కమిషనరేట్‌ చేపడుతుంది. ఇప్పటి వరకూ డిగ్రీ అడ్మిషన్లు మండ లి చూస్తోంది. ఇకపై ఆ బాధ్యత కమిషనరేట్‌దే. కరిక్యులమ్‌లో మార్పులు, వర్సిటీల ర్యాంకులు, ఇతర అకడమిక్‌ అంశాలకు మండలి పరిమితమవుతుంది.

Updated Date - Feb 28 , 2026 | 05:41 AM