Sankranti in AP: కో... అంటే కోట్లు
ABN , Publish Date - Jan 15 , 2026 | 03:06 AM
రాష్ట్రంలో బుధవారం పందెం పుంజులు కత్తులు దూశాయి. బరుల్లో రక్తమోడుతూ తలపడ్డాయి. నిర్వాహకుల వడిలో రూ.కోట్లు రాల్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండగ తొలిరోజే దాదాపు రూ.100 కోట్ల మేర చేతులు మారాయి.
తొలిరోజే రూ.300 కోట్లకుపైగా పందేలు
హైటెక్ బరులు.. పందెంరాయుళ్ల కోలాహలం
యథేచ్ఛగా పేకాట, గుండాట, మూడు ముక్కలాట
ఎటు చూసినా జిగేల్.. కార్పొరేట్ లుక్కు
సంక్రాంతి తొలిరోజున జూదక్రీడల జాతర
నూజివీడులో కారవాన్‌లో క్యాసినో క్రీడలు
పెద అమిరంలో రూ.కోటితో ముసుగు పందెం
కాకినాడలో ‘తెలంగాణ’ సందడి.. 80 కోట్ల పందేలు
ఇన్నోవా కారు, బుల్లెట్ బహుమతులతో జోష్
బుల్లెట్ గెలుచుకున్న బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో బుధవారం పందెం పుంజులు కత్తులు దూశాయి. బరుల్లో రక్తమోడుతూ తలపడ్డాయి. నిర్వాహకుల వడిలో రూ.కోట్లు రాల్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండగ తొలిరోజే దాదాపు రూ.100 కోట్ల మేర చేతులు మారాయి. భారీ బరుల వద్ద విందులతో నిర్వాహకులు పందెంరాయుళ్లలో జోష్ నింపారు. పేకాట, గుండాట, మూడు ముక్కలాట, లోనా బయటా.. వంటి జూదాలు యథేచ్ఛగా సాగాయి. మద్యం ఏరులై పారింది. చికెన్ అమ్మకాలు తారస్థాయికి చేరాయి. ఉండి నియోజకవర్గం పెద అమిరంలో బరికి పాస్‌లు మంజూరు చేశారు. అతిథులకు కారవాన్‌ల్లో వసతి కల్పించారు. ఒక్కో పందెం రూ.20 లక్షల నుంచి 25 లక్షల వరకు కాశారు. అక్కడకు సమీపంలోని సీసలిలో ప్రతి పందెం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వెళ్లింది. రెండు బరుల్లోనూ ముఖ్య నాయకులు పందేల్లో పాల్గొన్నారు. భీమవరం రూరల్ మండలం తాడేరు బరిలో ప్రహర్ష అనే యువకుడు వరుసగా నాలుగు పందేలు నెగ్గి బుల్లెట్‌ను గెలుచుకున్నాడు. ఇక్కడ ప్రతి పందెం రూ.లక్షల్లోనే సాగింది. తాడేపల్లిగూడెం పట్టణ సమీపంలోని ఓ తోటలో బుధవారం ఒకేరోజు 20 పందేలు నిర్వహించారు. ప్రతి పందెం ఏకంగా రూ.25 లక్షల వరకు జరిగింది. ఒక ముసుగు పందేన్ని రూ.65 లక్షలకు కాశారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో ఇదే పెద్దబరి. దీంతో ఇతర రాష్ర్టాల నుంచీ పందెం రాయుళ్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ముసుగు పందెం రూ.కోటి
పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరంలో ఒకే ఒక్క ముసుగు పందెం కోటి రూపాయల వరకు కాశారు. ఇరు వర్గాలు ముసుగులోనే కోడి పుంజులను తెచ్చి బరిలో నిలిపారు. రెండు కోళ్లు హోరాహోరీగా తలపడ్డాయి. భీమవరం మండలం తాడేరు, గొల్లవానితిప్ప రోడ్డులో 10 బరులు వేశారు.
కాయ్ రాజా కాయ్..: కాయ్ రాజా కాయ్ అంటూ.. పందెం రాయుళ్లను బరుల నిర్వాహకులు ఉత్సాహపరిచారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కోడి పందాల్లో కోట్ల రూపాయలను పణంగా పెట్టారు. గుండాటల్లో రూ. లక్షల్లోనే కాసి జేబులు ఖాళీ చేసుకున్నారు. 100కు పైగా పందెం బరుల్లో తొలిరోజు రూ.30 నుంచి రూ.40 కోట్ల మేర చేతులు మారినట్లు అంచనా. వీఐపీ బరిగా పేరున్న ఐ.పోలవరం మండలం మురమళ్ల బరి వద్ద భారీసంఖ్యలో కార్లు, మోటార్‌సైకిళ్లలో జనం క్యూకట్టారు. ప్రైవేట్ సైన్యం (బౌన్సర్లు) తనిఖీలు చేసి మరీ ఆ బరిలోకి పంపించారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో రాత్రి పగళ్లు పోటీలు సాగుతున్నాయి. డిజిటల్ స్ర్కీన్లు కూడా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. కోట్ల రూపాయల మేర ఇక్కడ పందేలు కాశారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, టీడీపీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరై తొలిరోజు పందేలను వీక్షించారు. సఖినేటిపల్లిలో కోడిపందేల బరి వద్ద ఆస్ట్రేలియా దేశస్తులు కోడిపుంజులను పట్టుకుని ఫొటోలు దిగి సందడి చేశారు. వందల సంఖ్యలో గుండాటలు ఏర్పాటు చేసి ఫోన్‌పేల్లో సైతం డబ్బులు కాయించి మరీ ప్రేక్షకులను నిలువు దోపిడీ చేశారు. రాజోలు దీవిలోని 10కిపైగా గ్రామాల్లో పండగ ముసుగులో అశ్లీల నృత్యాలు సాగాయి.
గుండాటలో మహిళల జోష్
పశ్చిమగోదావరి జిల్లా తాడేరులో ఎగ్జిబిషన్‌ను తలపించే రీతిలో బరి నిర్వహించి పందేలు కాశారు. యలమంచిలిలో సంక్రాంతి సంబరాల్లో 18 రకాల సంప్రదాయ మిఠాయిలు, మాంసాహారంతో 20 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ పక్కనే బరిలో నిర్వహించిన గుండాటలో మహిళలు సైతం ఉత్సాహంతో పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలో తేతలి, వేల్పూరులో బరులకు కార్లలో పందెం రాయుళ్లు వచ్చారు. పందెం రాయుళ్లకు గూగుల్ పే, స్కానర్లు ఏర్పాటు చేసి కమీషన్‌దారులు నగదు సమకూర్చారు.
కాకినాడలో రూ. కోట్ల కూత...
భారీ బరుల్లో కోడి పందేలు, గుండాట కలిపి కాకినాడ జిల్లాలో రూ.80కోట్లకు మించే పందేలు జరిగాయి. బరుల వద్ద అత్యధికంగా తెలంగాణ నుంచి వచ్చిన వారు పందేలు పెద్దఎత్తున కాశారు. కరప, తాళ్లరేవు, వలసపాకల, జగ్గంపేట, పెద్దాపురంలో పందేలు రూ.కోట్లు దాటాయి. ఇన్నోవా కార్లు, బుల్లెట్ గిఫ్ట్‌లతో బరుల వద్ద అసలు సిసలు సంక్రాంతి తలపించింది. తొలిరోజు పందేల్లో కొందరు తెలంగాణవాసులు బుల్లెట్లు గెలుచుకున్నారు. కాకినాడ రూరల్‌లోని వలసపాకలో భారీ బరుల్లో కోడిపందేలు, గుండాట కలిపి రూ.4కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయి. కరప మండలంలో రూ.8కోట్లకుపైగా పందేలు సాగాయి. ఇక్కడ మూడురోజులపాటు జరిగే మొత్తం 63 పందేల్లో అత్యధిక పందేలు గెలిచే విజేతకు ఇన్నోవా కారు బహుమతిగా ప్రకటించారు. యానాం సమీపంలోని తాళ్లరేవులో తొలిరోజు పందేలు రూ.6కోట్లు దాటాయి. గుడివాడలో ఆంధ్ర-తెలంగాణ మధ్య జరిగిన పందేల్లో ఆంధ్రాకు చెందిన పుంజు గెలవడంతో సంబరాలు జరిగాయి. విజేతకు బుల్లెట్ అందించారు. పులిమేరు మండలంలోని రాయభూపాలపట్నంలో కోడిపందేల బరుల విషయంలో టీడీపీ, జనసేన నేతల మద్య ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల నేతల మధ్య వివాదం చెలరేగి పందేలు ఆగిపోయాయి.