Share News

Water Disputes: తెలుగు రాష్ట్రాల జల జగడాలపై30న ఉన్నత స్థాయి కమిటీ తొలి భేటీ

ABN , Publish Date - Jan 17 , 2026 | 03:42 AM

ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ నెల 30న తొలి సమావేశం నిర్వహించనుంది.

Water Disputes: తెలుగు రాష్ట్రాల జల జగడాలపై30న ఉన్నత స్థాయి కమిటీ తొలి భేటీ

అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ నెల 30న తొలి సమావేశం నిర్వహించనుంది. కేంద్ర జలసంఘం చైర్మన్‌ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే ఈ భేటీలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ) చైర్మన్లు.. ఎన్‌డీడబ్ల్యూఏ చీఫ్‌ ఇంజనీర్‌, ఏపీ జల వనరుల శాఖ స్పెషల్‌ సీఎస్‌ సాయిప్రసాద్‌, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, అంతర్రాష్ట్ర జల వివాద విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ సుగుణాకర్‌రావు, తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు, కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, ఈఎన్‌సీ హాజరవుతారు. రెండు రాష్ట్రాల నడుమ నీటి నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలను ఆయా ప్రభుత్వాలు అందజేయడం.. కమిటీ చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కృష్ణా, గోదావరి బోర్డులు సమకూర్చడం.. కమిటీకి సహకరించడానికి ఇతర అధికారులు/నిపుణులను నియమించుకోవడం.. ఈ సమావేశం ఎజెండాగా పేర్కొంటూ కమిటీ సభ్య-కార్యదర్శి, జలసంఘం చీఫ్‌ ఇంజనీర్‌ రాకేశ్‌కుమార్‌ రెండు రాష్ట్రాలకూ తాజాగా సమాచారమిచ్చారు. చైర్మన్‌ అనుమతితో ఇతర అంశాలను ప్రస్తావించవచ్చని సూచించారు. సంబంధిత వివరాలతో సభ్యులు హాజరు కావాలని కోరారు. రాష్ట్రం నుంచి జల వనరుల శాఖ స్పెషల్‌ సీఎస్‌ సాయిప్రసాద్‌, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, అంతర్రాష్ట్ర జల వివాద విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ సుగుణాకర్‌రావు హాజరవుతారు. మూడు నెలల్లో నివేదిక అందించాలని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేయడంతో ఈ దిశగానే కమిటీ చర్చలకు శ్రీకారం చుట్టనుంది.

Updated Date - Jan 17 , 2026 | 03:43 AM