ఏసీఆర్‌లో ప్రతికూలతల నమోదుపై జాగ్రత్త!
ABN , Publish Date - Mar 29 , 2026 | 05:48 AM
న్యాయాధికారుల నిజాయితీ, సమగ్రతకు సంబంధించి రూపొందించే వార్షిక గోప్యత నివేదిక(ఏసీఆర్)లో ప్రతికూల అభిప్రాయాన్ని నమోదు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని...
న్యాయాధికారులపై ఆరోపణల్లో వాస్తవమెంతో క్రాస్ చెక్ చేసుకోవాలి
వివిధ మార్గాల నుంచి సమాచారం సేకరించాలి: హైకోర్టు
అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): న్యాయాధికారుల నిజాయితీ, సమగ్రతకు సంబంధించి రూపొందించే వార్షిక గోప్యత నివేదిక(ఏసీఆర్)లో ప్రతికూల అభిప్రాయాన్ని నమోదు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. సమాచారం సదరు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి నుంచి వచ్చినప్పటికీ, దానిని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకూడదని, వివిధ మార్గాల నుంచి సమాచారం సేకరించి నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీకి నిర్దేశించింది. ఆరోపణలను సరిచూసుకోకుండా(క్రా్‌సచెక్) న్యాయాధికారుల నిజాయితీపై ప్రతికూల అభిప్రాయం వ్యక్తపరచడం క్షేమం కాదని పేర్కొంది. తీర్పులు నచ్చని కక్షిదారులు, అసంతృప్తితో ఉన్న సహచరులు, ఉద్యోగులు, న్యాయాధికారుల నిజాయితీపై తప్పుడు ఆరోపణలు చేసే అవకాశం ఉందనేది అంగీకరించాల్సిన వాస్తవమంది. ఏసీఆర్‌లో తనపై నమోదు చేసిన ప్రతికూల అభిప్రాయాలను తొలగించాలని పెట్టుకున్న వినతిని హైకోర్టు రివ్యూ కమిటీ తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ ఓ నాయాధికారి 2013లో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. రివ్యూ కమిటీలో ఉన్న న్యాయమూర్తి వ్యక్తిగతంగా చేసిన రహస్య విచారణల ఆధారంగా పిటిషనర్ పునఃసమీక్ష దరఖాస్తును తిరస్కరించారని పేర్కొంది. అధికారి నిజాయితీ సందేహాస్పదంగా ఉందని నిరూపించడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు, కచ్ఛితమైన సమాచారం పొందడం కష్టమని పునఃసమీక్ష కమిటీ వ్యక్తపరిచిన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నామంది. కమిటీ నిర్ణయానికి భిన్నంగా అభిప్రాయాన్ని వెల్లడించలేమని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది.