వారు రేషన్ డీలర్‌గా కొనసాగరాదు
ABN , Publish Date - May 03 , 2026 | 04:27 AM
ప్రజాప్రతినిధులు, లాభదాయక పదవుల్లో ఉన్నవారు సమాంతరంగా రేషన్ డీలర్‌గా కొనసాగలేరని హైకోర్టు తేల్చి చెప్పింది. పౌరసరఫరాల శాఖ 2018లో జారీ చేసిన జీవో 32 ప్రకారం ఒకే సమయంలో అటు రేషన్ డీలర్‌గా...
ప్రజాప్రతినిధులు, లాభదాయక పదవుల్లో ఉన్నవారికి వర్తింపు
ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే ఓ పదవికి రాజీనామా చేయాలి: హైకోర్టు
అమరావతి, మే 2 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులు, లాభదాయక పదవుల్లో ఉన్నవారు సమాంతరంగా రేషన్ డీలర్‌గా కొనసాగలేరని హైకోర్టు తేల్చి చెప్పింది. పౌరసరఫరాల శాఖ 2018లో జారీ చేసిన జీవో 32 ప్రకారం ఒకే సమయంలో అటు రేషన్ డీలర్‌గా, ఇటు ప్రజాప్రతినిధిగా కొనసాగడానికి వీల్లేదని పేర్కొంది. ప్రస్తుత కేసులో పిటిషనర్ రేషన్ డీలర్‌గా ఉంటూ సర్పంచ్‌గా ఎన్నికయ్యారని గుర్తు చేసింది. ఒకసారి సర్పంచ్‌గా ఎన్నికైన తరువాత డీలర్ లేదా సర్పంచ్ పదవుల్లో ఏదో ఒకదానికి రాజీనామా చేయాలని స్పష్టం చేసింది. సర్పంచ్‌గా నామినేషన్ వేసేనాటికి రేషన్ డీలర్‌గా ఉన్నాననే విషయం అధికారులకు తెలుసన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. రేషన్ డీలర్ షిప్‌ను రద్దు చేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం కె.మార్కాపురం గ్రామానికి చెందిన ఆర్.జి.మద్దిలేటి రేషన్ డీలర్‌గా ఉంటూ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2024 నవంబరులో తహశీల్దార్ నిర్వహించిన తనిఖీల్లో రేషన్ దుకాణం స్టాక్‌లో భారీగా వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే సర్పంచ్ పదవిలో ఉంటూ రేషన్ డీలర్‌గా కొనసాగడం చట్టనిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఆర్‌డీవో డీలర్ షిప్‌ను రద్దు చేశారు.
జాయింట్ కలెక్టర్ వద్ద అప్పీల్ వేయగా అక్కడా ఎలాంటి ఉపశమనం లభించలేదు. దీంతో ఆర్‌డీవో, జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మద్దిలేటి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో రేషన్ కార్డు హోల్డర్ ఇంప్లీడ్ అయ్యారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రేషన్ డీలర్ షిప్‌ను రద్దు చేస్తూ ఆర్‌డీవో ఇచ్చిన ఆదేశాలు, వాటిని సమర్థిస్తూ జాయింట్ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. అధికారులు తన వివరణను పరిగణనలోకి తీసుకోలేదని, రాజకీయ దురుద్దేశంతో ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. రేషన్ కార్డు హోల్డర్ తరఫు న్యాయవాది షాజిద్ కొల్లూరు వాదనలు వినిపిస్తూ.. సర్పంచ్‌గా ఎన్నికైన నాటి నుంచి పిటిషనర్ నిత్యవసర సరుకులు సరిగ్గా సరఫరా చేయడం లేదన్నారు. రేషన్ డీలర్ షిప్‌ను రద్దు చేస్తూ అధికారులు సరైన నిర్ణయమే తీసుకున్నారన్నారు. పౌరసరఫరాల శాఖ తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది అప్పసాని వినీత్ వాదనలు వినిపిస్తూ.. రేషన్ డీలర్ షిప్ రద్దు చేసే విషయంలో అధికారులు చట్టనిబంధనలు పాటించారన్నారు. పిటిషనర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ తీసుకున్నారని తెలిపారు.