Share News

విచారణార్హతపై ముందుగా వాదనలు వింటాం

ABN , Publish Date - Feb 25 , 2026 | 05:17 AM

ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ వ్యవహారంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌...

విచారణార్హతపై ముందుగా వాదనలు వింటాం

  • ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టు స్పష్టీకరణ.. తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా

అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ వ్యవహారంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ మంగళవారం హైకోర్టు ముందు విచారణకు వచ్చింది. సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది మాధవ్‌ ఖురానా వాదనలు వినిపిస్తూ... ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్‌ పిటిషన్‌ దాఖలు చేయాల్సిన పిటిషనర్‌ ఆ పని చేయకుండా బెయిల్‌ రద్దు పిటిషన్‌ వేశారన్నారు. ఇది సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి వ్యాజ్యం విచారణార్హతపై ముందుగా వాదనలు వింటానని రామకృష్ణారెడ్డికి స్పష్టం చేశారు. తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేశారు. అంతకు ముందు రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సీఐడీని ప్రభావితం చేస్తున్నారన్నారు. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో బెయిల్‌ రద్దు కోరుతూ పిటిషన్‌ వేశామన్నారు. ఈ నెల 27న విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్‌ పిటిషన్‌ వేయాల్సి ఉందని, పిటిషన్‌ దాఖలుచేస్తే ఏసీబీ కోర్టు కేసును మూసివేస్తుందని అన్నారు. బెయిల్‌ రద్దు కోసం తాము దాఖలు చేసిన పిటిషన్‌ నిరర్థకం అవుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా వ్యాజ్యంపై విచారణ జరపాలని కోరారు.

Updated Date - Feb 25 , 2026 | 05:18 AM