విశాల్ గున్నీకి హైకోర్టులో ఎదురుదెబ్బ
ABN , Publish Date - May 06 , 2026 | 05:31 AM
ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసి, తక్షణం విధుల్లోకి తీసుకొని, పోస్టింగ్ ఇవ్వాలని గత ఏడాది ఆగస్టు 29న..
క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన ధర్మాసనం
ఈ విషయంలో లోతైన విచారణ అవసరమని వ్యాఖ్య
తదుపరి విచారణ ఆగస్టు 29కి వాయిదా
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసి, తక్షణం విధుల్లోకి తీసుకొని, పోస్టింగ్ ఇవ్వాలని గత ఏడాది ఆగస్టు 29న క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం నిలుపుదల చేసింది. తదుపరి విచారణ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడింది. క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఆగస్టు 29కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తుహిన్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ముంబై సినీనటి కాదంబరి జత్వానీ అక్రమ అరెస్ట్, అధికార దుర్వినియోగం, తదితర కారణాలతో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్‌లో ఉంచిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ విశాల్ గున్ని క్యాట్‌ను ఆశ్రయించారు. సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసి, విధుల్లోకి తీసుకొని పోస్టింగ్ ఇవ్వాలని, ఆయనకు రావాల్సిన అన్ని ప్రయోజనాలు కల్పించాలని క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర సీఎస్, డీజీపీ గత ఏడాది అక్టోబరులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రాగా రాష్ట్ర సీఎస్, డీజీపీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ... సినీనటి జత్వాని, కుటుంబ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే పక్క రాష్ట్రానికి వెళ్లి అరెస్ట్‌కు ప్రణాళిక రచించారని, విధి నిర్వహణలో తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని వివరించారు.
సస్పెన్షన్ ఉత్తర్వుల చెల్లుబాటు విషయానికే క్యాట్ పరిమితం కాకుండా, క్రిమినల్ కేసు విచారణ అంశాల్లోకి వెళ్లిందన్నారు. కాలపరిమితి ముగియకముందే సస్పెన్షన్ ఉత్తర్వులను క్యాట్ రద్దు చేసిందని, దీంతో విచారణలో ముందుకు వెళ్లలేకపోయామన్నారు. క్యాట్ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలని కోరారు. విశాల్ గున్ని తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పిటిషనర్ వేరే రాష్ట్రానికి వెళ్లి, అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరిపారు తప్ప, అరెస్ట్ ప్రక్రియలో పాల్గొనలేదన్నారు. 2024లో సస్పెండ్ చేశారని, ఆ ఉత్తర్వుల గరిష్ఠ కాలపరిమితి ఏడాది మాత్రమేనని చెప్పారు. ఇప్పటివరకు విచారణాధికారిని నియమించలేదన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే క్యాట్ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. వీటిలో జోక్యం చేసుకోవద్దని కోరారు. ఇరువైపుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. వ్యాజ్యంపై లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడింది. క్యాట్ ఉత్తర్వుల అమలును తదుపరి విచారణ వరకు సస్పెండ్ చేసింది.