Share News

ఆ జీవో ఆధారంగా కొడాలి నానిపై చర్యలు వద్దు

ABN , Publish Date - Jul 01 , 2026 | 06:16 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో..

ఆ జీవో ఆధారంగా కొడాలి నానిపై చర్యలు వద్దు

  • మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

  • 29న చార్జ్‌షీటు దాఖలుపై ఆగ్రహం.. విచారణ ఆగస్టు 11కు వాయిదా

అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ రాష్ట్ర హోం శాఖ జారీ చేసిన జీవో, కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ అమలును నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఆదేశాల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 468 ప్రకారం మూడేళ్లలోపు శిక్షకు వీలున్న కేసుల్లో మూడేళ్ల తర్వాత దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను కాగ్నిజెన్స్‌లోకి తీసుకోవడంపై నిషేధం ఉందని గుర్తు చేసింది. 2021 ఫిబ్రవరిలో ఘటన జరిగితే 2026 జూన్‌లో ప్రాసిక్యూషన్‌కు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది. కేసును కాగ్నిజెన్స్‌లోకి తీసుకోవాలా? లేదా అనేది ట్రయల్‌ కోర్టు పరిధిలోని వ్యవహారమని, ఈ దశలో హైకోర్టు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న ప్రభుత్వ న్యాయవాది వాదనను తప్పుపట్టింది. తదుపరి విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వ్యాజ్యంలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సి.రఘు, హోం శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది(జీపీ) జయంతి వాదనలను వినిపించారు. వ్యాజ్యంపై ఈనెల 29న విచారణ జరిపి వివరాలు తెప్పించుకునేందుకు జీపీకి సమయం ఇస్తే, అదే రోజు చార్జ్‌షీట్‌ దాఖలు చేయడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, గుడివాడ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోలపై మండిపడ్డారు. వారికి గుణపాఠం చెబుతామని, వారి హాజరుకు ఆదేశించి ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరించారు. జీపీ ఉన్నది పోలీసులు చెప్పిన విషయాలను కోర్టుకు చెప్పడానికి కాదని వ్యాఖ్యానించారు. పోస్ట్‌మ్యాన్‌ డ్యూటీ చేయవద్దని హితవు పలికారు.

Updated Date - Jul 01 , 2026 | 06:16 AM