High Court: కోర్టు ఉత్తర్వులంటే కనీస మర్యాద లేదు
ABN , Publish Date - Jan 06 , 2026 | 06:21 AM
కోర్టు ఉత్తర్వుల అమలులో రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిని హైకోర్టు ఎండగట్టింది.
పవర్‌ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నాం.. ఏమీ చేయలేరనే భావన
విద్యాశాఖ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): కోర్టు ఉత్తర్వుల అమలులో రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిని హైకోర్టు ఎండగట్టింది. పవర్‌ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నందున తమను ఎవరూ ఏమి చేయలేరనే భావనలో ఉన్నట్లు కనపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులంటే వారికి కనీస మర్యాద లేదంది. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి బి.శ్రీనివాసరావుపై సుమోటోగా కోర్టుధిక్కరణ చర్యలు ప్రారంభించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణకు హాజరై సింగిల్ జడ్జి ఉత్తర్వులు అమలుకాకపోవడంపై వివరణ ఇవ్వాలని శ్రీనివాసరావును నిర్దేశించింది. విచారణను నెలరోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. కేజీబీవీల్లో పార్ట్‌టైం పీజీటీలుగా పనిచేస్తున్న తమను అర్ధంతరంగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ బాధితులు 2023లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేసు విచారణ విషయంలో ధర్మాసనం ఆ వ్యాఖ్యలు చేసింది.