మా ఆదేశాలు అమలు చేయలేదేం?
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:44 AM
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌పై హైకోర్టు మండిపడింది. గ్రూప్-1 మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థులను తక్షణం కీలక పోస్టుల నుంచి అప్రాధాన్య పోస్టులకు మార్చాలని...
‘తక్షణం’ అనే పదానికి అర్థం తెలియదా?.. సీఎ్‌సను నిలదీసిన హైకోర్టు ధర్మాసనం
ఉత్తర్వులు అమలు చేస్తారా? జైలుకెళ్తారా?
సీఎ్‌సను నాలుగు రోజులు జైల్లో ఉంచితే
ఇతర అధికారులు దారికొస్తారని వ్యాఖ్య
కోర్టు ఉత్తర్వులను సీఎస్సే గౌరవించకుంటే
కింది అధికారులేం పాటిస్తారని మండిపాటు
ఉద్యోగాలకు ఎంపికైనవారు సీఎస్‌ను మేనేజ్ చేసినట్లుందని ఘాటు వ్యాఖ్యలు
ఉత్తర్వుల అమలుకు సమయం కోరిన సీఎస్
ఇప్పటికే 15 రోజులైందని బెంచ్ అసహనం
కనీసం 2 రోజులివ్వాలని అభ్యర్థించిన ఏజీ
నేటిలోగా ఉత్తర్వుల అమలుకు ఆదేశం
మా ఉత్తర్వులు అమలు చేయకపోవడం చూస్తుంటే.. ఉద్యోగాలకు ఎంపికైనవారు సీఎస్‌ను మేనేజ్ చేసినట్లు కనపడుతోంది. ఆ అధికారులతో ఆయన కుమ్మక్కయ్యారు. కోర్టు ఆదేశాల అమలుకు 11 నుంచి నేటి వరకు ఏం చేశారో చూపించండి. ఏజీ సూచనలతోనే ఉత్తర్వులు అమలు చేయనట్లు కనపడుతోంది.
- ధర్మాసనం
అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌పై హైకోర్టు మండిపడింది. గ్రూప్-1 మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థులను తక్షణం కీలక పోస్టుల నుంచి అప్రాధాన్య పోస్టులకు మార్చాలని ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేసి... రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు నివేదిక సమర్పించాలని ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని కోర్టు ముందు హాజరైన విజయానంద్‌ను నిలదీసింది. తక్షణం అనే పదానికి అర్థం తెలియదా? అని ప్రశ్నించింది. సీఎస్ మరో నాలుగు రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నారని, ఈ నాలుగు రోజులు జైల్లో ఉంచితే ఇతర అధికారులు దారికొస్తారని వ్యాఖ్యానించింది. ఉత్తర్వులు అమలు చేస్తారా? లేదా జైలుకి వెళ్తారా? అని సీఎ్‌సను ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులను సీఎ్‌సయే గౌరవించకుంటే కింది అధికారులకు ఇంకేమి గౌరవం ఉంటుందని నిలదీసింది. కోర్టు ఉత్తర్వులను గౌరవించాల్సిన అవసరం లేదని కింది అధికారులకు సందేశం ఇస్తున్నారా అని ప్రశ్నించింది. కీలక పోస్టుల్లో ఉన్న అధికారులు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎంపిక కాని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఎంపికైన వారిని అప్రాధాన్య పోస్టులకు మార్చాలని ఆదేశాలిచ్చామని పేర్కొంది. తమ ఉత్తర్వులు అమలు చేయకపోవడాన్ని చూస్తుంటే ఉద్యోగాలకు ఎంపికైనవారు ఇప్పటికే సీఎ్‌సను మేనేజ్ చేసినట్లు కనపడుతోందని, ఆ అధికారులతో సీఎస్ కుమ్మక్కయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. గ్రూప్-1కు ఎంపికై ప్రస్తుతం వివిధ పోస్టుల్లో కొనసాగుతున్నవారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ప్రస్తుత అధికారి పార్టీ అధినేత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారని గుర్తు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు ఉన్నారని, గ్రూప్-1 ద్వారా ఎంపికైన వారిని బదిలీ చేయడం ద్వారా ఏర్పడే ఖాళీలను వారితో భర్తీ చేయవచ్చు కదా? అని ప్రశ్నించింది. తాము కూడా స్పందించకుంటే న్యాయవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులు అమలు చేసేందుకు సహేతుక సమయం ఇవ్వాలన్న సీఎస్ అభ్యర్థనపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే 15 రోజులు గడిచిచాయని, గురువారంలోగా ఉత్తర్వులు అమలు చేస్తారో, లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించింది. ఏజీ జోక్యం చేసుకుంటూ వారం రోజుల సమయం ఇవ్వాలని కోరారు. ఉత్తర్వులు అమలు చేస్తామన్నారు. అందుకు ధర్మాసనం విముఖత చూపడంతో కనీసం 2 రోజుల సమయం ఇవ్వాలని ఏజీ అభ్యర్థించారు. హాజరు నుంచి సీఎ్‌సకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఉత్తర్వులు అమలు చేసి కోర్టుకు నివేదిస్తామన్న సీఎస్ చెప్పిన వివరాలను ధర్మాసనం నమోదు చేసింది. రేపటిలోగా ఉత్తర్వులు అమలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఉత్తర్వులు అమలు చేస్తే సీఎస్ తమ ముందు హాజరుకావాల్సిన అవసరం లేదని, లేకుంటే మాత్రం కోర్టుకు రావాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.
న్యాయ సలహా కోరాం: సీఎస్
ధర్మాసనం స్పందిస్తూ... కోర్టు ఉత్తర్వులు ఎందు కు అమలు చేయలేదని సీఎ్‌సను నిలదీసింది. సీఎస్ బదులిస్తూ... కోర్టు ఉత్తర్వులను అనుసరించి సిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులను అప్రాధాన్య పోస్టులకు మార్చాలన్న ఆదేశాలపై న్యాయ సలహా కోరామని తెలిపారు. ఈ దశలో అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ.. ప్రాధాన్య, అప్రాధాన్య పోస్టులకు సంబంధించి చట్టబద్ధమైన నిబంధనలు, సర్వీస్ రూల్స్‌లో ఫోకల్, నాన్‌ఫోకల్ పోస్టులకు సంబంధించి ఎలాంటి నిర్వచనం లేదన్నారు. ఈ విషయంలో సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి అన్ని శాఖల హెచ్‌వోడీలను వివరాలను కోరారని చెప్పారు. వారి నుంచి ఎలాంటి వివరాలు అందలేదని, దీంతో సీఎస్ న్యాయ సలహా కోరారని వివరించారు. ఈ నేపథ్యంలోనే క్లారిఫికేషన్ కోరుతూ ఈ నెల 19న మెమో దాఖలు చేశామని, అయితే వివిధ కారణాల వల్ల మెమో నంబర్ కాలేదని పేర్కొన్నారు. ఇందులో తన కార్యాలయం తప్పు కూడా ఉందన్నారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకూడదన్న ఉద్దేశం సీఎ్‌సకు లేదన్నారు. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదని తప్పుగా అర్థం చేసుకోవద్దని అభ్యర్థించారు.
ఇప్పటి వరకూ ఏం చేశారో చూపించండి: ధర్మాసనం
ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... ఫోకల్, నాన్ ఫోకల్‌కి సంబంధించి 1966లోనే కార్యనిర్వాహక ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగానే ఉత్తర్వులు అమలు చేయలేదని ప్రాథమికంగా భావిస్తున్నామని పేర్కొంది. ఏజీ తీరు కోర్టు ఉత్తర్వులు అమలు చేయని అధికారులను సమర్థించేవిగా ఉన్నాయని పేర్కొంది. అడ్వొకేట్ జనరల్ నుంచి ఈ తరహా వాదనలను ఆశించలేదని వ్యాఖ్యానించింది. ‘కోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు ఫిబ్రవరి 11 నుంచి నేటి వరకు ఏమి చేశారో చూపించండి. ఏజీ సూచనలతోనే ఉత్తర్వులు అమలు చేయనట్లు కనపడుతోంది. నిద్రపోయేవారిని లేపవచ్చు కానీ, నిద్ర నటించేవారిని లేపలేము. కోర్టు ఆదేశాలు అమలు చేయకుంటే న్యాయస్థానాలను మూసివేయడం మంచిది’’ అని ధర్మాసనం ఘా టుగా వ్యాఖ్యానించింది. అధికారులకు కోర్టు ఉత్తర్వుల పట్ల గౌరవం లేనప్పటికీ, తమకు అధికారులపై గౌరవం ఉందని స్పష్టం చేసింది.
ఇదీ జరిగింది...
2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా 169 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ, ఉద్యోగాలు పొందిన కొందరు అభ్యర్థులు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ అప్పీళ్లపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం. జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణల్లో వాస్తవాలను తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులందరినీ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కీలక పోస్టుల నుంచి అప్రాధాన్య పోస్టులకు మార్చాలని ఆదేశించింది. మంగళవారం జరిగిన విచారణలో కోర్టు ఉత్తర్వులు అమలుకాకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సుమోటో కోర్టుధిక్కరణ కేసు ఎందుకు నమోదు చేయకూడదో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని సీఎ్‌సను ఆదేశించింది. బుధవారం వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా సీఎస్ విజయానంద్ కోర్టు ముందు హాజరయ్యారు.
గూగుల్, ఏఐని అడిగినా చెబుతాయి
ఏజీ స్పందిస్తూ.... తనకు తప్పుడు ఉద్దేశాలను ఆపాదించవద్దని కోరారు. అడ్వొకేట్ జనరల్‌గా ప్రభుత్వం, సీఎ్‌సకు మద్దతుగా వాదనలు వినిపించాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. 1966లో ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టులను గుర్తించాలని ఆయా శాఖలను ఆదేశించారని, ఆ తరువాత దానిపై ఎలాంటి పురోగతి లేదని వెల్లడించారు. ధర్మాసనం స్పందిస్తూ... కార్యనిర్వాహక ఉత్తర్వులు అనంతరం ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టుల విషయంలో అనేక ఉత్తర్వులు ఇచ్చారని, వాటన్నింటినీ పరిశీలించాలని సూచించింది. ఫోకల్, నాన్‌ఫోకల్ అర్థం గురించి గూగుల్, ఏఐని అడిగితే చెబుతుందని తెలిపింది. ఎలాంటి చట్టనిబంధనలు, కార్యనిర్వాహక ఉత్తర్వులు లేకున్నా, కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలనే ఉద్దేశం ఉంటే సాధారణ డిక్షనరీలోని అర్థాన్ని అనుసరించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా ఎంపికకాని అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపిస్తూ... ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టు విచారణ జరపనుందన్నారు. అప్పీల్ వేసే హక్కు అందరికీ ఉంటుందని, అందులో ఎలాంటి తప్పు లేదని ధర్మాసనం పేర్కొంది.