High Court: సీఎంపై మూసివేసిన కేసుల రికార్డులివ్వండి
ABN , Publish Date - Jan 01 , 2026 | 05:55 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పి.నారాయణ తదితరులపై నమోదైన కేసుల రికార్డులు ఇచ్చేందుకు బెజవాడ ఏసీబీ కోర్టు...
హైకోర్టులో పిటిషన్లు దాఖలు
పూర్తి వివరాలు సమర్పించాలని సీఐడీకి న్యాయస్థానం ఆదేశం
విచారణ వారం రోజులకు వాయిదా
అమరావతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పి.నారాయణ తదితరులపై నమోదైన కేసుల రికార్డులు ఇచ్చేందుకు బెజవాడ ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. వాటిని విచారణకు స్వీకరించి.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ గ్రిడ్, లిక్కర్, మద్యం పాలసీలకు సంబంధించి చంద్రబాబు తదితరులపై నమోదు చేసిన కేసులను విజయవాడ ఏసీబీ కోర్టు ఇటీవల మూసివేసింది. వీటి తీర్పు ప్రతులతో పాటు రికార్డులన్నింటినీ ఇవ్వాలని కోరగా కోర్టు నిరాకరించింది. దీనిపై ఎమ్మార్పీఎస్ ఏపీ అధ్యక్షుడు సువర్ణరాజు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘రాష్ట్రం, నిందితులు కుమ్మక్కై కేసులు మూసివేయించుకుంటున్నారు. ఇప్పటికే ఐదారు కేసుల విచారణను మూసివేసినట్లు తెలిసింది. మూసివేత ఉత్తర్వుల కాపీలు ఇవ్వాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించగా థర్డ్ పార్టీకి ఇవ్వలేమని నిరాకరించింది’ అని తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘కోర్టు ముందున్న కేసుల్లో మీరు మూడోపక్షం, ఆ కాపీలు మీకెందుకు? వాటిని పొందేందుకు మీకు అర్హత ఎక్కడుంది’ అని ప్రశ్నించారు. పొన్నవోలు బదులిస్తూ... సీఆర్‌పీసీ సెక్షన్ 363(3) ప్రకారం మూడోపక్షానికి తీర్పు ప్రతులు పొందే అర్హత ఉందని.. క్రిమినల్ రివిజన్ పిటిషన్ సైతం దాఖలు చేయవచ్చని తెలిపారు.సీఐడీ తరఫున అదనపు పీపీ పాణిని సోమయాజి స్పందిస్తూ.. ఏసీబీ కోర్టు నుంచి ప్రతులను పొందే అర్హత పిటిషనర్‌కు లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశించారు.