Share News

భార్య సౌకర్యానికే ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , Publish Date - Feb 22 , 2026 | 04:39 AM

వైవాహిక వివాదాలకు సంబంధించి నమోదైన కేసుల బదిలీ విషయంలో హైకోర్టు స్పష్టత ఇచ్చింది. దంపతుల మధ్య వివాదం తలెత్తినప్పుడు, కేసు విచారణ ఏ ప్రాంతంలో జరగాలనే విషయంలో...

భార్య సౌకర్యానికే ప్రాధాన్యం ఇవ్వాలి

  • వైవాహిక వివాదాల కేసుల బదిలీలపై హైకోర్టు స్పష్టత

అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): వైవాహిక వివాదాలకు సంబంధించి నమోదైన కేసుల బదిలీ విషయంలో హైకోర్టు స్పష్టత ఇచ్చింది. దంపతుల మధ్య వివాదం తలెత్తినప్పుడు, కేసు విచారణ ఏ ప్రాంతంలో జరగాలనే విషయంలో భర్త కంటే భార్య సౌకర్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. బదిలీ పిటిషన్ల విచారణ సందర్భంగా సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. భార్యకు తగినంత ఆర్థిక స్థోమత లేకున్నా, ప్రయాణ ఇబ్బందులున్నా ఆమె అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. వైవాహిక వివాదాలకు సంబంధించి రెండు వేర్వేరు కేసులలో తమ భర్త దాఖలు చేసిన పిటిషన్లను తమకు అనుకూలమైన ప్రాంతానికి బదిలీ చేయాలని ఇద్దరు మహిళలు దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిచ్చింది. విడాకుల కోసం పిటిషన్లు వేసిన భర్తలను తప్పనిసరిగా కోర్టు ముందు హాజరుకావాలని ఒత్తిడి చేయవద్దని, క్రాస్‌ ఎగ్జామినేషన్‌, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే హాజరుకు ఆదేశించాలని సంబంధిత కోర్టును ఆదేశించింది. భర్త తరఫున న్యాయవాది హాజరవుతున్నంత కాలం వ్యక్తిగత హాజరు అవసరం లేదని స్పష్టం చేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ఇటీవల తీర్పు ఇచ్చారు. గుంటూరుకు చెందిన మోహనమురళి, అతడి భార్య రాజేశ్వరి మధ్య వివాదాలు తలెత్తడంతో పిల్లలతో కలిసి రాజేశ్వరి ఒంగోలులో నివాసం ఉంటున్నారు. భర్త నుంచి మనోవర్తి కోరుతూ రాజేశ్వరి 2021లో ఒంగోలు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. భార్యనుంచి విడాకులు కోరుతూ మురళి రేపల్లె కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా రేపల్లె కోర్టుకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని విడాకులు కేసును ఒంగోలుకు బదిలీ చేయాలని కోరుతూ రాజేశ్వరి 2025లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


అలాగే తిరుపతికి చెందిన పవన్‌, అతడి భార్య ఐశ్వర్య మధ్య వివాదాలు తలెత్తడంతో ఐశ్వర్య ఆదోనిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. విడాకులు కోరుతూ తిరుపతి కోర్టులో భర్త దాఖలు చేసిన కేసు విచారణకు తాను రావాలంటే 400 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని, కేసును ఆదోనికి బదిలీ చేయాలని ఐశ్వర్య మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి... కేసుల విచారణ విషయంలో భర్త కంటే భార్యల సౌకర్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

Updated Date - Feb 22 , 2026 | 04:39 AM