ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ ఆధారంగా.. వ్యవసాయ భూములకు పరిహారం కోరలేరు
ABN , Publish Date - May 28 , 2026 | 05:11 AM
ఇళ్లస్థలాల మార్కెట్ విలువను చూపించి వ్యవసాయ భూములకు పరిహారం పెంచాలని కోరలేరని హైకోర్టు స్పష్టం చేసింది. మార్కెట్ విలువకు సంబంధించి...
ప్రభుత్వం న్యాయమైన పరిహారమే చెల్లించింది
స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం
అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): ఇళ్లస్థలాల మార్కెట్ విలువను చూపించి వ్యవసాయ భూములకు పరిహారం పెంచాలని కోరలేరని హైకోర్టు స్పష్టం చేసింది. మార్కెట్ విలువకు సంబంధించి అప్పీలుదారులు కోర్టు ముందు ఉంచిన వివరాలు ఇళ్ల స్థలాలకు సంబంధించినవని, వాటి ఆధారంగా వ్యవసాయ భూములకు పరిహారం పెంచాలని కోరడం సరికాదని పేర్కొంది. 2008లో స్వాధీనం చేసుకున్న భూములకు 2010 మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లించాలని అప్పీలుదారులు కోరలేరని తెలిపింది. పేదల ఇళ్ల కోసం అప్పీలుదారుల నుంచి సేకరించిన అసైన్డ్ భూములకు అధికారులు రూ.1.50లక్షల మార్కెట్ విలువతోపాటు సొలాటియం (వేదనకు చెల్లించే పరిహారం)కింద 30 శాతం, 12 శాతం అదనపు మార్కెట్ విలువ, వడ్డీలు సైతం చెల్లించారని పేర్కొంది. కడప అవుటర్ రింగ్ రోడ్డు కోసం సేకరించిన భూములకు అధికారులు భూసేకరణ పరిహారం కింద రూ.1.20లక్షల పరిహారం మాత్రమే చెల్లించారని, అప్పీలుదారులకు చెందిన భూములు వాటి సమీపంలోనే ఉన్నాయని గుర్తు చేసింది. పరిహారం చెల్లింపు విషయంలో 2008లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడంతోపాటు ప్రైవేటు భూములకు మించి అధికారులు పరిహారం చెల్లించారని, ఈ నేపథ్యంలో కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అప్పీల్ సూట్‌లను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలో సర్వే నం.846/1, 846/2 వేంపల్లి ఖాసిం సాహెబ్, గుండ్లూరు పీరమ్మలకు 2002లో ప్రభుత్వం డీకేటీ పట్టాలు మంజూ రు చేసింది. పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చే నిమిత్తం 2004లో ఈ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఎకరాకు రూ.1.50లక్షల చొప్పున మార్కెట్ విలువ నిర్ణయించగా, దీనిపై వీరు కడప సివిల్ కోర్టును ఆశ్రయించారు. పరిహారం పెంపు కోసం దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఖాసిం సాహెబ్, పీరమ్మ హైకోర్టులో అప్పీల్ చేశారు.