High Court: ‘మదనపల్లె’పై జోక్యం చేసుకోలేం
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:01 AM
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చడాన్ని నిలువరించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మార్చడాన్ని నిలువరించలేం: హైకోర్టు
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చడాన్ని నిలువరించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలలో జోక్యం చేసుకోలేమంది. గతంలో ఓ మండల హెడ్‌క్వార్ట ర్ మార్పులో ఓ హైకోర్టు జోక్యం చేసుకోగా, సుప్రీంకోర్టు తప్పుపట్టిందని గుర్తు చేసింది. తరలింపు ప్రక్రియపై స్టే విధించేందుకు నిరాకరించింది. జిల్లా కేంద్రం మార్పు విషయంలో చట్టనిబంధనలు ప్రకారమే నడుచుకున్నామని ప్రభుత్వం చెబుతోందని, ఈ నేపఽథ్యంలో పూర్తివివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అన్నమయ్య జిల్లా కేం ద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది బి. వెంకటనారాయణరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సి.సుమన్ వాదనలు వినిపిస్తూ.. జిల్లా కేంద్రం మార్పు విషయం లో రెవెన్యూ శాఖ ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్ ఏపీ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ చట్టం- 1974లోని సెక్షన్ 3(5)కి అనుగుణంగా లేదన్నారు. ప్రజలు, భాగస్వామ్య పక్షాల నుంచి అభ్యంతరాలు స్వీకరించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. 2022లో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఏర్పడిందని, మూడేళ్లలోనే ఎలాంటి కారణాలు లేకుండా జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చారన్నారు. జిల్లా కేంద్రం మార్చడం వల్ల కార్యాలయాల నిర్మాణం కోసం ఖర్చు చేసిన కోట్ల రూపాయలు వృథా అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) ఎస్.ప్రణతి స్పందిస్తూ.. జిల్లా కేంద్రం మార్పు విషయంలో చట్టనిబంధనల ప్రకారమే నడుచుకున్నామన్నారు. మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలని పలు అభ్యర్థనలు వచ్చాయన్నారు. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచుతామన్నారు.