ఆటిజం బాధిత బాలికపై లైంగిక వేధింపులు
ABN , Publish Date - May 14 , 2026 | 05:50 AM
ఆటిజంతో బాధపడుతున్న 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడైన స్కూల్ ప్రిన్సిపాల్ సాంబశివరావుకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.
స్కూల్ ప్రిన్సిపాల్‌పై కేసు.. బెయిల్ రద్దు చేసిన హైకోర్టు
మూడు రోజుల్లో కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశం
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ఆటిజంతో బాధపడుతున్న 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడైన స్కూల్ ప్రిన్సిపాల్ సాంబశివరావుకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. మొదటి బెయిల్ పిటిషన్, రెండవ పిటిషన్ మధ్య పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు లేనప్పటికీ పోక్సో ప్రత్యేక కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టింది. తీర్పు ప్రతి అందిన 3 రోజుల్లో సంబంధిత కోర్టు ముందు లొంగిపోవాలని నిందితుడికి స్పష్టం చేసింది. లొంగిపోని పక్షంలో నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని పోలీసులకు ఆదేశించింది. మరోవైపు ఈ వ్యవహారాన్ని హైకోర్టు సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌ను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఇటీవల తీర్పు ఇచ్చారు. ఆటిజంతో బాధపడుతున్న తన మనవరాలు, మైనర్ బాలికను విజయవాడలోని ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ సాంబశివరావు లైంగికంగా వేధించారని బాధితురాలి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పోక్సో, బీఎన్‌ఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు మార్చి 12న అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. బెయిల్ కోసం నిందితుడు దరఖాస్తు చేసుకోగా మార్చి 18న ట్రయల్ కోర్టు దానిని తిరస్కరించింది. వారం రోజుల్లో మార్చి 26న నిందితుడు రెండో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఏప్రిల్ 8న బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నిందితుడి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ బాధితురాలి అమ్మమ్మ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున న్యాయవాదులు వీవీ సతీష్, కె.ఐశ్వర్య చౌదరి వాదనలు వినిపించారు. మొదటి బెయిల్ పిటిషన్ను రద్దు చేసిన తరువాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకున్నా ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. మహిళా ఇన్‌స్పెక్టర్‌కు బాధితురా లు ఇచ్చిన వాంగ్మూలాన్ని ప్రత్యేక కోర్టు విస్మరించిందని తెలిపారు. కోర్టులో ఉన్న బాధితురాలు తనపై నిందితుడు పాల్పడిన లైంగిక వేధింపులను నేరుగా వివరించినప్పటికీ పరిగణలోకి తీసుకోలేదన్నారు. నిందితుడి బంధువులు బాధితురాలి ఇంటికి వచ్చి కేసు వెనక్కి తీసుకోవాలని కుటుంబ సభ్యులను బెదిరించారన్నారు. ఈ విషయంలో కేసు కూడా నమోదైందని కోర్టుకు నివేదించారు. ఈ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. పిటిషనర్ పై ఆరోపణల తీవ్రత, బాధితురాలి మానసికస్థితి, మొదటి బెయిల్ పిటిషన్ రద్దు తరువాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకున్నా రెండో పిటిషన్‌ను అనుమతించడం, బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.