Share News

అలాగైతే విచారించడం కష్టం!

ABN , Publish Date - Jul 04 , 2026 | 05:11 AM

కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును పోలీసు కస్టడీకి ఇస్తూ విధించిన షరతులపై సిట్‌ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. విజయవాడ కోర్టు విధించిన కఠినమైన షరతులను..

అలాగైతే విచారించడం కష్టం!

  • కోర్టు షరతులతో దర్యాప్తునకు ఆటంకం

  • జైలులోనే విచారించాలన్న షరతుపై స్టే విధించండి

  • నాగరాజు కస్టడీ విషయంలో షరతులపై హైకోర్టుకు సిట్‌

  • విచారణ వాయిదా వేయాలన్న సీఐ తరఫు న్యాయవాది

అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును పోలీసు కస్టడీకి ఇస్తూ విధించిన షరతులపై సిట్‌ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. విజయవాడ కోర్టు విధించిన కఠినమైన షరతులను సవరించాలని అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్‌లో సిట్‌ కోరింది. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రధాన నిందితుడు సీఐ నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు కొన్ని షరతులు విధించిన సంగతి తెలిసిందే. సిట్‌ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరగ్గా సీఐ నాగరాజు తరఫున న్యాయవాది చల్లా అజయ్‌కుమార్‌ వాదిస్తూ... పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు విచారణను సోమవారానికి వాయిదా వేయాలని అభ్యర్థించారు. అయితే పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సిట్‌ తరఫున పీపీ మెండ లక్ష్మీనారాయణ ధర్మాసనాన్ని కోరారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు విచారణను ఆదివారానికి వాయిదా వేశారు. ఈ నెల 3వతేదీ నుండి 10వరకు(8 రోజులు) నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ 2వ అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు పలు కఠినమైన షరతులు విధిస్తూ ఈనెల 2న ఉత్తర్వులు జారీ చేసింది. తాను ఎంచుకున్న న్యాయవాదుల సమక్షంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే నాగారాజును విచారించాలని, ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ చేయాలని, కోర్టు తదుపరి ఆదేశాల వరకు వీడియో ఫుటేజ్‌ను భద్రపరచాలని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఆదేశాలను సవరించాలని/రద్దు చేయాలని కోరుతూ సిట్‌ అడిషనల్‌ ఎస్పీ హైకోర్టును ఆశ్రయించారు.


విజయవాడ కోర్టు విధించిన షరతులు సిట్‌ దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని సిట్‌ తరఫున పీపీ లక్ష్మినారాయణ వాదనలు వినిపించారు. నేర ఘటన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిందని, సీఐ నాగరాజును రాజమహేంద్రవరం కారాగారంలో ఇంటరాగేట్‌ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదన్నారు. సిట్‌ ఉన్నతాధికారులు అందరూ జైలుకి వెళ్లి విచారించడం కష్టం అవుతుందన్నారు. జైలు నుండి బయటకు తీసుకెళ్లకుంటే నిందితుడి వాంగ్మూలం ఆధారంగా సాక్ష్యాలను కనుగొనడం సాధ్యం కాదన్నారు. నిందితుడిని విచారించే సమయంలో న్యాయవాదిని అనుమతించడానికి అభ్యంతరం లేదన్నారు. 10వ తేదీ తరువాత పోలీస్‌ కస్టడీని పొడిగించేది లేదని విజయవాడ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు. సీఐనాగరాజును రాజమహేంద్రి జైలులోనే విచారించాలని విజయవాడ కోర్టు విధించిన షరతుపై స్టే విధించాలని కోరారు. నాగరాజు తరఫు న్యాయవాది చల్లాఅజయ్‌కుమార్‌ స్పం దిస్తూ పోలీస్‌ కస్టడీని పొడిగించే అధికారం హైకోర్టుకు ఉందన్నారు. తమ వాదనకూడా విన్న తర్వాత ప్రాసిక్యూషన్‌ వాదనలోబలముందని భావిస్తే కస్టడీని పొడిగించినా అభ్యంతరం లేదన్నారు.


అనుమానాస్పద వస్తువులను సీజ్‌ చేశాం

అనుమానాస్పద మరకలు ఉన్న ఒక లాఠీ, ఎముకలు, కాలిన బూడిద, సగం కాలిన స్టీల్‌ మణికట్టు గొలుసు, ఇతర వస్తువులను ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం సీజ్‌ చేశామని సిట్‌ అదనపు ఎస్పీ పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘సాయి కృష్ణ కస్టడీలో ఉంచుకున్న విషయాన్ని విచారణ సమయంలో నిందితుడు సీఐ నాగరాజు గోప్యంగా ఉంచారు. మే 1 నుండి జూన్‌ 1 మధ్య కాలానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను నాశనం చేశారనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికలో పేర్కొంది. సాయికృష్ణ మృతదేహాన్ని ఇప్పటివరకు కనుగొనలేదు. సాయి కృష్ణ మృతికి దారితీసిన పరిస్థితులు, మృతదేహాన్ని కనిపించకుండా చేయడం, సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడం పై దర్యాప్తు కొనసాగుతోంది’ అని సిట్‌ అదనపు ఎస్పీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 05:14 AM