Share News

ఆస్తి పంపకం కోసం డీఎన్‌ఏ పరీక్షకు ఆదేశించం

ABN , Publish Date - May 26 , 2026 | 05:19 AM

ఆస్తి పంపకాల వివాదంలో డీఎన్‌ఏ పరీక్షకు ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది. పితృత్వ నిరూపణకు డీఎన్‌ఏ పరీక్షను ఓ సాధనంగా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

ఆస్తి పంపకం కోసం డీఎన్‌ఏ పరీక్షకు ఆదేశించం

  • పిటిషనర్‌కు తేల్చి చెప్పిన హైకోర్టు

  • దిగువ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టీకరణ

అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): ఆస్తి పంపకాల వివాదంలో డీఎన్‌ఏ పరీక్షకు ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది. పితృత్వ నిరూపణకు డీఎన్‌ఏ పరీక్షను ఓ సాధనంగా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తర్లాడ రాజశేఖరరావు ఇటీవల తీర్పు ఇచ్చా రు. విజయనగరం జిల్లాకు చెందిన ఎస్‌.నరసయ్యరెడ్డిపై దింగు కనక మహాలక్ష్మి ఆస్తి పంపకాల కోసం పార్టీషన్‌ సూట్‌ దాఖలు చేశారు. అయితే కనక మహాలక్ష్మి తన కుమార్తె కాదని, తన అన్నయ్య కుమార్తె అని, నిజానిజాలు తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష జరపాలని కోరుతూ నరసయ్యరెడ్డి ఈ పార్టీషన్‌ సూట్‌లో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. నరసయ్య అభ్యర్థనను తిరస్కరిస్తూ ఈ ఏడాది జనవరి 9న విజయనగరం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నరసయ్యరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. డీఎన్‌ఏ పరీక్షల విషయంలో పిల్లల హక్కుల సంరక్షణకు సుప్రీంకోర్టు, హైకోర్టు గతంలో తీర్పులు ఇచ్చాయని గుర్తు చేశారు. పిల్లలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలా? వద్దా? అనేది పిల్లల కోణం నుంచిచూడాలి తప్ప తల్లిదండ్రుల కోణం నుంచి కాదన్నారు.


ఎవిడెన్స్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 112 ప్రకారం అత్యంత బలమైన కారణం ఉంటే తప్ప పిల్లలకు డీఎన్‌ఏ పరీక్షకు నిర్వహించడానికి వీల్లేదని, పరీక్ష ద్వారా పిల్లల ప్రతిష్ఠ, సమాజంలో వారి హోదా దెబ్బతినే ప్రమాదం ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు. మహాలక్ష్మి తన కుమార్తె కాదని నిరూపించడానికి ఇతర మార్గాలను అనుసరించాలి తప్ప డీఎన్‌ఏ పరీక్ష కోరడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. నరసయ్యరెడ్డి అభ్యర్థనను నిరాకరిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు న్యాయమూర్తి సమర్థించారు. సివిల్‌ రివిజన్‌ పిటిషన్‌ను కొట్టివేశారు. నరసయ్యరెడ్డికి రూ. 3 వేలు జరిమానా విధిస్తూ, ఈ మొత్తాన్ని డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి చెల్లించాలని స్పష్టం చేశారు. జరిమానా చెల్లించని పక్షంలో పిటిషనర్‌ను సివిల్‌ జైలుకు పంపించాలని విజయనగరం కోర్టును ఆదేశించారు.

Updated Date - May 26 , 2026 | 05:20 AM