Share News

అత్యాచారం కేసులో సీఐ చిన్నమల్లయ్యకు హైకోర్టు షాక్‌

ABN , Publish Date - May 16 , 2026 | 06:28 AM

అత్యాచారం ఆరోపణలతో నమోదైన కేసులో సీఐ చిన్నమల్లయ్యకు హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

అత్యాచారం కేసులో సీఐ చిన్నమల్లయ్యకు హైకోర్టు షాక్‌

  • ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): అత్యాచారం ఆరోపణలతో నమోదైన కేసులో సీఐ చిన్నమల్లయ్యకు హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. పిటిషనర్‌ కుమారుడు శివశంకర్‌, బాధితురాలికి ఫోన్‌ చేసి బెదిరించినట్లు, ఫోన్‌కు మెసేజ్‌లు పంపించినట్లు ఆధారాలను ప్రాసిక్యూషన్‌ కోర్టు ముందు ఉంచిందని గుర్తు చేసింది. పిటిషనర్‌ తన అధికారాన్ని ఉపయోగించి దర్యాప్తులో జోక్యం చేసుకోవడంతో పాటు బాధితురాలిని ప్రభావితం, ఒత్తిడి చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. కోర్టు ముందున్న వివరాలు, ఆరోపణల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని, ముందస్తు బెయిల్‌ పొందేందుకు పిటిషనర్‌ అర్హుడు కాదని భావిస్తున్నామని పేర్కొంది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్‌ మెడమల్లి బాలాజీ ఉత్తర్వులు ఇచ్చారు. అత్యాచారం చేశారంటూ తనపై పల్నాడు జిల్లా, వినుకొండ మండలం, బ్రాహ్మణపల్లికి చెందిన ధనలక్ష్మి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వినుకొండ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సీఐ చిన్న మల్లయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - May 16 , 2026 | 06:28 AM