పవన్‌పై ఫిర్యాదు చేసేందుకు పీపీకి ఏం అధికారం ఉంది?
ABN , Publish Date - Apr 17 , 2026 | 05:05 AM
వలంటీర్లపై వ్యాఖ్యల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై అప్పటి గుంటూరు కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ అధికారంతో ఫిర్యాదు చేశారని హైకోర్టు ప్రశ్నించింది.
వలంటీర్లపై వ్యాఖ్యల వ్యవహారంలో పీపీ ఫిర్యాదు చేయడంపై హైకోర్టు అభ్యంతరం
అమరావతి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): వలంటీర్లపై వ్యాఖ్యల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై అప్పటి గుంటూరు కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ అధికారంతో ఫిర్యాదు చేశారని హైకోర్టు ప్రశ్నించింది. ఆ నాటికి పవన్ ఎంపీ, ఎమ్మెల్యే కాదని గుర్తు చేసింది. అప్పట్లో ఫిర్యాదు దాఖలు చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో సైత ం హేతుబద్ధంగా లేదని వ్యాఖ్యానించింది. పవన్‌పై ప్రాసిక్యూషన్ ఉపసంహరణకు అనుమతిస్తూ గుం టూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై గురువారం ప్రాసిక్యూషన్ వాదనలు ముగిశాయి. రిప్లై వాదనలు వినిపించేందుకు తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు ఉత్తర్వులు ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ మాట్లాడుతూ.. వలంటీర్లు సేకరించిన సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తోందని, మహిళలు అపహరణకు గురౌతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై గత వైసీపీ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ఐపీసీ సెక్షన్ 499, 500 కింద గుంటూరు కోర్టులోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా పవన్‌పై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. కేసు వేసేందుకు అఫిడవిట్లు ఇచ్చిన ఐదుగురు వలంటీర్లు... పవన్ వ్యాఖ్యల వల్ల తమ ప్రతిష్ఠకు భంగం కలగలేదని, వైసీపీ నేతలు తమ నుంచి సంతకాలు తీసుకొని పిటిషన్లు వేశారని అఫిడవిట్లు వేశారు.
దీంతో పవన్ కల్యాణ్‌పై ప్రాసిక్యూషన్ ఉపసంహరణకు అనుమతించాలని పీపీ గుంటూరు కోర్టులో పిటిషన్ వేశారు. గుంటూరు 4వ అదనపు జిల్లా జడ్జి ఇందుకు అనుమతిస్తూ 2024 నవంబరులో ఉత్తర్వులిచ్చారు. వీటిని సవాల్ చేస్తూ సరళ, మరో ముగ్గురు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈవ్యాజ్యం గురువారం విచారణకు రాగా ప్రాసిక్యూషన్ తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటిశ్రీనివాస్ వాదనలు వినిపించారు. అప్పటికి పవన్ పబ్లిక్ సర్వెంట్లు నిర్వచనం పరిధిలోకి రారని, వ్యాఖ్యలు చేసేనాటికి ప్రజాప్రతినిధి కాదని అన్నారు. థర్డ్‌పార్టీకి క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖ లు చేసే అర్హత లేదని, పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.