ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబుపై క్రిమినల్ కేసా?
ABN , Publish Date - Mar 18 , 2026 | 03:58 AM
రాజధాని అసైన్డ్ భూము ల విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని జీవో జారీచేస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై...
సీఐడీని నిలదీసిన హైకోర్టు.. అసైన్డ్ భూములపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది
అభ్యంతరముంటే కోర్టుల్లో సవాల్ చేయాలి.. క్రిమినల్ కేసు ఎలా పెడతారు?
అసలు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా?.. దర్యాప్తు సంస్థకు న్యాయమూర్తి ప్రశ్నలు
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రాజధాని అసైన్డ్ భూము ల విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని జీవో జారీచేస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై క్రిమినల్ కేసు ఎలా నమోదు చేస్తారని సీఐడీని హైకోర్టు ప్రశ్నించింది. అప్పటి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సీఐడీ అదనపు డీజీ ఎలా ఆదేశిస్తారని నిలదీసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అర్హత దర్యాప్తు సంస్థకు ఎక్కడ ఉందని ప్రశ్నించింది. ‘ప్రభుత్వ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే రాజ్యాంగబద్ధ కోర్టుల్లో సవాల్ చేయాలి తప్ప క్రిమినల్ కేసు ఎలా నమోదు చేస్తారు? కేసు నమోదుకు ముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారా.. అప్పుడు సీఐడీ అదనపు డీజీగా ఎవరు ఉన్నారు? ఆయన ప్రస్తుతం సర్వీసులోనే ఉన్నారా, పదవీ విరమణ చేశారా’ అని ప్రశ్నించింది. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా కేసు నమోదు చేసి ఉంటే సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలకు ఎందుకు ఆదేశాలు ఇవ్వకూడదో చెప్పాలని ఆదేశించింది. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా కేసు నమోదు చేయడానికి అనుసరిస్తున్న విధానం ఏమిటి.. ఏ ప్రాతిపదికన కేసు నమోదు చేశారు.. తదితర వివరాలు తమముందుంచాలని పేర్కొంది. వివరాలు సమర్పించేందుకు సీఐడీ అదనపు పీపీ సమయం కోరడంతో విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు ఉత్తర్వులు ఇచ్చారు. రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో నాటి ఎమ్మెల్యే ఆళ్ల ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు, పి.నారాయణ వ్యాజ్యాలు దాఖలు చేశారు. మంగళవారం విచారణకు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాణిని సోమయాజి హాజరయ్యారు.