విచారణకు రావాలని నోటీసులివ్వం
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:39 AM
శాసనసభ పట్ల ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేలా ‘కోట్లు ఖర్చు-శిక్షణ తుస్సు’ శీర్షికతో కథనం ప్రచురించిన వ్యవహారంలో విచారణకు రావాలంటూ...
హైకోర్టుకు నివేదించిన శాసనసభ స్టాండింగ్ కౌన్సిల్
‘సాక్షి’ ఎడిటర్, చీఫ్ రిపోర్టర్ అప్పీళ్లపై విచారణ వాయిదా
అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): శాసనసభ పట్ల ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేలా ‘కోట్లు ఖర్చు-శిక్షణ తుస్సు’ శీర్షికతో కథనం ప్రచురించిన వ్యవహారంలో విచారణకు రావాలంటూ ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ ఫణికుమార్‌కు తదుపరి విచారణ వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వబోమని శాసనసభ స్టాండింగ్ కౌన్సిల్ హైకోర్టుకు నివేదించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అప్పీళ్లపై తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుల ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రివిలేజ్ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై, కథనం ప్రచురణపై వివరణ కోరుతూ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రాసిన లేఖపై ‘సాక్షి’ ఎడిటర్ రక్కసి ధనంజయ రెడ్డి, చీఫ్ రిపోర్టర్ బి.ఫణికుమార్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. గురువారం విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. కథనం సభాహక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందో, రాదో తేల్చకుండా సాక్ష్యాలతో హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం సరికాదని, ముందుగా ఈ వ్యవహారాన్ని తేల్చాలని కోరారు. శాసనసభ వ్యవహారాల ముఖ్యకార్యదర్శి తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.... ప్రివిలేజ్ కమిటీ విచారణ ప్రాథమిక దశలో ఉందని తెలిపారు. అపరిపక్వ దశలో పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు.