ఇంధన సరఫరా మెరుగుపడినట్లుంది: హైకోర్టు
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:17 AM
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ లభ్యతపై తాజా పరిస్థితిని వివరిస్తూ స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పెట్రోలియం కంపెనీలను హైకోర్టు ఆదేశించింది.
అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ లభ్యతపై తాజా పరిస్థితిని వివరిస్తూ స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పెట్రోలియం కంపెనీలను హైకోర్టు ఆదేశించింది. విచారణను వారంరోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టిస్తున్న పెట్రోల్ బంకులపై తనిఖీలు నిర్వహించేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన కె.ఉమావల్లి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. బుధవారం వ్యాజ్యం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బంకుల వద్ద ప్రజలు క్యూలు కడుతున్నారన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పెట్రోల్, డీజిల్ సరఫరా విషయంలో ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడిందని వ్యాఖ్యానించింది.