Share News

AP High Court: తదుపరి విచారణ వరకు వంశీని అరెస్ట్‌ చేయవద్దు

ABN , Publish Date - Jan 03 , 2026 | 06:35 AM

వైసీపీనేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తదుపరి విచారణ వరకు అరెస్ట్‌ చేయవద్దని మాచవరం పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

AP High Court: తదుపరి విచారణ వరకు వంశీని అరెస్ట్‌ చేయవద్దు

  • పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): వైసీపీనేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తదుపరి విచారణ వరకు అరెస్ట్‌ చేయవద్దని మాచవరం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. నూతక్కి సునీల్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హత్యాయత్నం, తదితర సెక్షన్ల కింద విజయవాడ పరిధిలోని మాచవరం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సత్యశ్రీ స్పందిస్తూ.. అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు అనుబంధ పిటిషన్‌ వేశామన్నారు. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌పై మొత్తం 19 కేసులు ఉన్నాయని, నేరచరిత్రను పిటిషనర్‌ వ్యాజ్యంలో పేర్కొనలేదని చెప్పారు. ఈ వివరాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఘటన జరిగిన 16 నెలల తరువాత పోలీసులు కేసు పెట్టారని గుర్తుచేసింది. ముందస్తు బెయిల్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు తగిన సమయం లేనందున తదుపరి విచారణ వరకు పిటిషనర్‌ను అరెస్ట్‌ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. విచారణను సంక్రాంతి సెలవులు తరువాతకి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Jan 03 , 2026 | 06:35 AM