24న సిట్ ముందు హాజరుకండి
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:26 AM
మద్యం రవాణాలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో నమోదైన కేసులో ఈనెల 24న సిట్ దర్యాప్తు అధికారి ముం దు హాజరుకావాలని నిందితుడు కసిరెడ్డి రాజశేఖరెడ్డిని హైకోర్టు ఆదేశించింది.
కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టు ఆదేశం
ముందస్తు బెయిల్ విచారణ 24కి వాయిదా
అమరావతి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): మద్యం రవాణాలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో నమోదైన కేసులో ఈనెల 24న సిట్ దర్యాప్తు అధికారి ముం దు హాజరుకావాలని నిందితుడు కసిరెడ్డి రాజశేఖరెడ్డిని హైకోర్టు ఆదేశించింది. విచారణకు హాజరుకావాలంటూ సిట్ ఇచ్చిన నోటీసుకు కట్టుబడి ఉండాల్సిందేని కసిరెడ్డికి స్పష్టం చేసింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చా రు. వైసీపీ హయాంలో మద్యం రవాణాలో జరిగిన అక్రమాలపై నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం కోర్టు విచార ణ ప్రారంభమైన వెంటనే వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫున న్యాయవాది అభయ్ సిద్ధాంత్ అభ్యర్ధించారు. విచారణకు హాజరుకావాలని వాట్సప్ ద్వారా పదే పదే నోటీసులు జారీ చేస్తున్నారన్నారు. దీంతో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు లంచ్‌మోషన్‌గా విచారణకు స్వీకరించింది. దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యేందుకు తగినంత సమయం కూడా ఇవ్వడం లేదని న్యాయవాది అభయ్ సిద్ధాంత్ వాదించారు. నోటీసులకు స్పందించలేదనే కారణంతో పిటిషనర్‌ను అరెస్ట్ చేసే ప్రమాదం ఉందన్నారు. సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపి స్తూ... పిటిషనర్ దర్యాప్తునకు సహకరించడం లేదన్నారు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయవద్దని కోరారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ నెల 24న సిట్ అధికారుల ముందు విచారణకు హాజరుకావాలని కసిరెడ్డిని ఆదేశించారు.