Share News

‘గీతంకు భూముల’పై హైకోర్టు విచారణ

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:08 AM

విశాఖపట్నం, రుషికొండ పరిధిలో 54.79 ఎకరాలను గీతం యూనివర్సిటీ పేరు మీద క్రమబద్ధీకరించేందుకు రెవెన్యూ అధికారులు చేసిన ప్రతిపాదనను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.

‘గీతంకు భూముల’పై హైకోర్టు విచారణ

  • పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం

అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం, రుషికొండ పరిధిలో 54.79 ఎకరాలను గీతం యూనివర్సిటీ పేరు మీద క్రమబద్ధీకరించేందుకు రెవెన్యూ అధికారులు చేసిన ప్రతిపాదనను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌, విశాఖ గ్రామీణ తహసీల్దార్‌, గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ మతుకుమిల్లి శ్రీభరత్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. విశాఖకు చెందిన న్యాయవాది నిమ్మి గ్రేస్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ‘భూములు చాలాకాలం నుండి యూనివర్సిటీ అధీనంలో ఉన్నాయి. వాటిని వర్సిటీ పేరుమీద క్రమబద్దీకరించేందుకు తహసీల్దార్‌ ప్రతిపాదనలు చేశారు. క్రమబద్దీకరణకు వర్సిటీ యాజమాన్యం దరఖాస్తు చేయలేదు. ప్రతిపాదించిన భూమిని రెవెన్యూ రికార్డుల్లో రాస్తా, కొండ, కాలువగా నిర్వచించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 30 ప్రకారం ఆ భూములను క్రమబద్దీకరించడానికి వీల్లేదు’ అని వాదించారు. రెవెన్యూ తరఫున ప్రభుత్వ న్యాయవాది కృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘పిటిషన్‌కు విచారణార్హత లేదు. ప్రస్తుత వ్యవహారంతో పిటిషనర్‌కు సంబంధం లేదు. న్యాయ విచారణ ప్రక్రియను పిటిషనర్‌ దుర్వినియోగం చేస్తున్నారు. పిటిషనర్‌ చేస్తున్న ఆరోపణలకు, కోర్టు ముందు ఉంచిన ప్రభుత్వ జీవోకు సంబంధం లేదు. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు.


భూకేటాయింపునకు, భూక్రమబద్దీకరణకు మధ్య వ్యత్యాసం ఉంది. విశాఖలో ఏ సంస్థకు భూములు కేటాయించినా ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ కోర్టులో వ్యాజ్యాలు వేస్తున్నారు. ప్రభుత్వ అధికారులను బ్లాక్‌ మెయిల్‌ చేయడం కోసమే ఇలాంటి వ్యాజ్యాలు వేస్తున్నారు’ అని వివరించారు. గీతం వర్సిటీ ప్రెసిడెంట్‌ ఎం.శ్రీభరత్‌ తరఫున న్యాయవాది రుద్రప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ... ‘భూముల కేటాయింపునకు సంబంధించి నివర్సిటీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగానే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తాం’ అని పేర్కొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 05:09 AM