High Court: టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్‌కుమార్ మరణంపై దర్యాప్తు వేగవంతం చేయండి
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:43 AM
పరకామణిలో చోరీకి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ అప్పటి ఏవీఎస్వో, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ వై.సతీశ్‌కుమార్ మరణంపై దర్యాప్తును వేగవంతం చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
చార్జ్‌షీట్ దాఖలు చేసేవరకు పర్యవేక్షిస్తాం
పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్‌తో టీటీడీ, సెక్యూరిటీ, పోలీసు అధికారులు కుమ్మక్కు
ఆ అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోండి
సంబంధిత శాఖలకు హైకోర్టు ఆదేశం
పరకామణి కేసు దర్యాప్తు తీరుపై సంతృప్తి
అమరావతి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): పరకామణిలో చోరీకి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ అప్పటి ఏవీఎస్వో, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ వై.సతీశ్‌కుమార్ మరణంపై దర్యాప్తును వేగవంతం చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. చార్జ్‌షీట్ దాఖలు చేసేంతవరకు తాము దర్యాప్తును పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. ఏసీబీ దాఖలు చేసిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను పరిశీలిస్తే నిందితుడు రవికుమార్ ప్రభుత్వ అధికారి నిర్వచనం పరిధిలోకి వస్తారని, ఐపీసీ సెక్షన్ 409(నేరపూరిత విశ్వాసఘాతుకం) అతనికి వర్తిస్తుందని పేర్కొంది. రవికుమార్, అతని కుటుంబ సభ్యులకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు, స్థిరచరాస్తులతో పాటు బంగారం, వెండి పెద్దఎత్తున ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయని పేర్కొంది. పరకామణి చోరీ కేసును నిర్వీర్యం చేసేందుకు టీటీడీలోని అప్పటి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు రవికుమార్‌తో కుమ్మక్కయ్యారని తెలిపింది. రవికుమార్, అతని కుటుంబ సభ్యుల ఆస్తుల స్వీకరణ విషయంలో టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులు నిబంధనలు అనుసరించలేదని పేర్కొంది. చట్టనిబంధనలు అతిక్రమించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ, పోలీసు, సెక్యూరిటీ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించింది. కేసు దర్యాప్తుపై సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సంబంధిత అధికారులను అభినందించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుసరించి చట్టనిబంధనల మేరకు దర్యాప్తు కొనసాగించవచ్చని సీఐడీ, ఏసీబీకి స్పష్టం చేసింది.
పరకామణిలో కానుకల లెక్కింపునకు సంబంధించి తీసుకురానున్న తక్షణ సంస్కరణల విషయంలో టీటీడీ సమర్పించిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కానుకలు లెక్కింపునకు వచ్చే భక్తులను అమానవీయరీతిలో తనిఖీ చేయడాన్ని ఆమోదించలేమని పేర్కొంది. కానుకల లెక్కింపునకు టేబుళ్లు ఏర్పాటు చేయాలని న్యాయస్థానం చేసిన సూచనను పాటించడం సాధ్యంకాదని ఈవో నివేదికలో పేర్కొనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లెక్కింపు ప్రక్రియలో మర్యాదపూర్వక విధానాన్ని అమలు చేసేందుకు అత్యత్తమ ఆలోచనలతో ముందుకు రావాలని టీటీడీ ఈవోను ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.
కానుకలపై నడవడం సంప్రదాయమా?
పరకామణిలో సంస్కరణలకు సంబంధించి తక్షణ, శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని టీటీడీని ఆదేశించిన విషయం తెలిసిందే. గురువారం వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. టీటీడీ తరఫు న్యాయవాది శ్రీనివాసబాబా వాదనలు వినిపిస్తూ.. ‘‘ప్రతీరోజు పరకామణిలో 300మంది భక్తులు కానుకలు లెక్కిస్తారు. వీరందరికీ టేబుళ్లు ఏర్పాటు చేయడం ఆచరణ సాధ్యం కాదు. మార్పులు చేయాలంటే ఈవో ఒక్కరే నిర్ణయం తీసుకుంటే సరిపోదు. ఏమైనా మార్పులు చేయాలంటే ఆగమశాస్త్ర పండితులు, టీటీడీ బోర్డు ఆమోదం తప్పనిసరి’’ అని తెలిపారు. తాను పరకామణిలో జరిగే ప్రక్రియను ఫొటోలలో చూశానని, కానుకలను కింద పోసి వాటిపై నడవడం సంప్రదాయమా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కానుకల లెక్కింపుకు అనుసరిస్తున్న విధానం సరికాదన్నారు.
రవికుమార్ అప్పీల్‌పై విచారణ వాయిదా
పరకామణి చోరీ కేసును లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకున్న వ్యవహారం పై సీఐడీ విచారణకు ఆదేశించడంతో పాటు ఆస్తుల విషయంలో దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ నిందితుడు రవికుమార్ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణను ధర్మాసనం ఈ నెల 29కి వాయిదా వేసింది. పూర్తిస్థాయిలో వాదనలు వినేందుకు సమయం లేనందున అప్పీల్‌పై మరోరోజు విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.