High Court Orders: కోడి పందేలను అడ్డుకోండి
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:55 AM
సంక్రాంతి సందర్భంగా జరిగే కోడిపందేలను అడ్డుకోవాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను హైకోర్టు ఆదేశించింది.
జంతుహింస, జూదనిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయండి
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు హైకోర్టు ఆదేశం
అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సందర్భంగా జరిగే కోడిపందేలను అడ్డుకోవాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను హైకోర్టు ఆదేశించింది. జంతుహింస నిరోధకచట్టం-1960, ఏపీ జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని, గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. గ్రామాల్లో సభలు నిర్వహించి చట్టనిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. బరుల వద్ద కోడి కత్తులు, ఇతర పందెం సామగ్రి, సొమ్ములను తక్షణం స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది. అవసరమైతే 144 సెక్షన్ అధికారాన్ని వినియోగించాలని సూచించింది. చట్ట నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకొనేందుకు పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి కాళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహించడం ద్వారా జీవహింసకు పాల్పడుతున్నారని, పందేలను అడ్డుకోవాలని, అక్రమ మద్యం, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిలువరించాలని కోరుతూ హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై న్యాయమూర్తి విచారణ సందర్భంగా పిటిషనర్లు వాదనలు వినిపిస్తూ.. గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది ఎ.జయంతి వాదనలు వినిపిస్తూ.. చట్టవ్యతిరేక కార్యక్రమాలపై ప్రజలను చైతన్యపరిచేలా పోలీసులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కలెక్టర్లు, జిల్లా ఎస్పీలను ఆదేశించారు.