Share News

ఆ ప్రొఫెసర్లను కొనసాగించండి

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:18 AM

ఉన్నత విద్యాశాఖ పరిధిలోని యూనివర్సిటీలలో పనిచేస్తూ యూజీసీ స్కేల్‌ తీసుకుంటున్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం...

ఆ ప్రొఫెసర్లను కొనసాగించండి

  • వ్యవసాయ శాఖ వర్సిటీల్లోని ప్రొఫెసర్ల రిటైర్మెంట్‌పై హైకోర్టు ఆదేశం

  • మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం

  • విద్యాశాఖలోని వారికి రిటైర్మెంట్‌ వయస్సు పెంచి వ్యవసాయ శాఖ వారికి నిరాకరించడం వివక్షేనని వ్యాఖ్య

  • కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం

అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యాశాఖ పరిధిలోని యూనివర్సిటీలలో పనిచేస్తూ యూజీసీ స్కేల్‌ తీసుకుంటున్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం... వ్యవసాయ శాఖ పరిధిలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్నవారికి పదవీ విరమణ వయస్సు పెంచకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది ఉన్నత విద్యాశాఖ, వ్యవసాయ శాఖ పరిధిలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ, డాక్టర్‌ వైయ్‌సఆర్‌ ఉద్యాన యూనివర్సిటీ, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీ ఫిషరీస్‌ యూనివర్సిటీలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల మధ్య వివక్ష చూపించడమేనని వ్యాఖ్యానించింది. పదవీ విరమణ వయస్సు పెంపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అయినప్పటికీ... ప్రభుత్వ చర్య వివక్షపూరితంగా ఉండకూడదని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగంలోని అధికరణ 14కి విరుద్ధంగా ఉందని పేర్కొంది. పదవీ విరమణ వయస్సు పెంపు సిఫారసులను తిరస్కరిస్తూ ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాసిన లేఖను సస్పెండ్‌ చేసింది. పిటిషనర్లలో కొందరు పదవీ విరమణ వయస్సుకు దగ్గరగా ఉన్నారని, ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కోర్టును ఆశ్రయించిన ప్రొఫెసర్లను విధుల్లో కొనసాగించాలని ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ సుభేందు శమంతతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.


ఉన్నత విద్యాశాఖ పరిధిలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న బోధన సిబ్బంది పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ పరిధిలోని ఉద్యాన, వెటర్నరీ, ఫిషరీస్‌, ఎన్జీ రంగా యూనివర్సిటీల్లో పనిచేస్తున్న బోధన సిబ్బందికి పదవీ విరమణ వయస్సు పెంచకపోవడాన్ని సవాల్‌ చేస్తూ పలువురు ప్రొఫెసర్లు, డీన్లు, శాఖాధిపతులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి... పదవీ విరమణ వయస్సు పెంపు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని స్పష్టం చేశారు. 2023 జూలై 29న జారీ చేసిన జీవో 39కి అనుగుణంగా వ్యవసాయ శాఖ పరిధిలోని యూనివర్సిటీలకు పదవీ విరమణ వయస్సు పెంపు విస్తరించే విషయంలో సమగ్ర నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గత ఏడాది నవంబరు 5న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుపై వ్యవసాయ శాఖ పరిధిలోని వర్సిటీల్లో పని చేస్తున్న పలువురు ప్రొఫెసర్లు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీళ్లు వేశారు. ఈ అప్పీళ్లు ఇటీవల విచారణకు రాగా వ్యవసాయ శాఖ పరిధిలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచకపోవడంపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో సోమవారం ధర్మాసనం ముందు హాజరైన బుడితి రాజశేఖర్‌ కాంపిటెంట్‌ అథారిటీ నిర్ణయం మేరకు పదవీ విరమణ వయస్సు పెంపు విషయంలో యూనివర్సిటీల ప్రతిపాదనలను తిరస్కరించినట్టు తెలిపారు. అయితే అందుకుగల కారణాలను పేర్కొనకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ ఉన్నత పదవుల్లో ఉన్నవారి ఆలోచనలు తెలుసుకోకుండా... అధికారులు ఎలా నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించింది. 2023లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంపు అభ్యర్థనను అప్పటి ప్రభుత్వం తిరస్కరించిందని, ప్రస్తుత ప్రభుత్వం సైతం ఆ నిర్ణయాన్ని సమర్థిస్తోందని గుర్తు చేసింది. అలాంటప్పుడు మార్పు ఎక్కడ ఉందని? ప్రశ్నించింది. కౌంటర్‌ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరుతున్న నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు పిటిషనర్లను సర్వీసులో కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

Updated Date - Feb 24 , 2026 | 04:18 AM