ఆ పోస్టులను ఉపేక్షించం
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:13 AM
వాక్ స్వాతంత్య్రం పేరుతో వ్యక్తుల ప్రతిష్ఠకు భం గం కలిగించేలా మాట్లాడతాం, సోషల్ మీడియాలో పోస్టులు పెడతామంటే ఉపేక్షించబోమని హైకోర్టు హెచ్చరించింది.
వాక్ స్వేచ్ఛ పేరిట వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించడానికి వీల్లేదు
తేల్చి చెప్పిన రాష్ట్ర హైకోర్టు
వ్యక్తిగత స్వేచ్ఛనూ మేమే కాపాడాలి
పోలీసులు వేధిస్తుంటే చూస్తూ ఊరుకోం
సజ్జల భార్గవ్ పిటిషన్ విచారణలో వ్యాఖ్యలు
కౌంటర్లు వేయకపోవడంపై ఇమిగ్రేషన్, డీజీపీ, జిల్లాల ఎస్పీలపై అసంతృప్తి
గతంలో ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యం ఉండేది.. ఇప్పుడది లెక్కలేనితనంగా మారిందని అసహనం
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): వాక్ స్వాతంత్య్రం పేరుతో వ్యక్తుల ప్రతిష్ఠకు భం గం కలిగించేలా మాట్లాడతాం, సోషల్ మీడియాలో పోస్టులు పెడతామంటే ఉపేక్షించబోమని హైకోర్టు హెచ్చరించింది. అదే సమయంలో, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమని, పోలీసులు వారిని వేధిస్తుంటే చూ స్తూ ఊరుకోబోమంది. బాధితులు ఏ పార్టీ వారనేది సంబంధం లేకుండా వారి హక్కు లు కాపాడతామని పేర్కొంది. సోషల్ మీడి యా పోస్టుల వ్యవహారంలో తనపై జారీ అయిన లుక్ అవుట్ నోటీసును(ఎల్‌వోసీ) రద్దు చేయాలని కోరుతూ, వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి గతంలో వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలను అనుసరించి, కేంద్ర హోంశాఖ, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, డీజీపీ, కృష్ణా, పల్నాడు, కడప, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, గుంటూరు, అన్నమయ్య, ఏలూరు, బాపట్ల జిల్లాల ఎస్పీలు, విజయవాడ పోలీస్ కమిషనర్ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై మండిపడింది. సీఐడీ అధికారులు కౌంటర్లు వేసినప్పటికీ అవి సంతృప్తికరంగా లేవని పేర్కొంది. అఫిడవిట్ దాఖలు చేయమని సీఐడీ ఎస్పీకి ఆదేశాలు ఇస్తే, ఇన్‌స్పెక్టర్ ఎలా వేస్తారని నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వ లీగల్ టీమ్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటర్లు వేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని, తదుపరి విచారణ నాటికి కౌంటర్లు వేయాలని ఇమ్మిగ్రేషన్ బ్యూరో, డీజీపీ, జిల్లాల ఎస్పీలను ఆదేశించింది. లేనిపక్షంలో ఆరోజు కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు.. భార్గవ్‌రెడ్డి తరఫు న్యాయవాది ఎల్లారెడ్డి వాదనలు వినిపించారు. ‘‘పిటిషనర్‌పై మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఎల్‌వోసీ జారీ చేయాలని తాము కోరలేదని అన్నమయ్య జిల్లా ఎస్పీ తన కౌంటర్‌లో పేర్కొన్నారు’’ అని వాదించారు. దీనిపై అన్నమయ్యజిల్లా ఎస్పీ తరఫున హోంశాఖ అదనపు ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ... ఎల్‌వోసీ జారీ చేయాలని తామెవరినీ కోరలేదన్నారు. సీఐడీ తరఫున హాజరైన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైతం ఇదే సమాధానం ఇచ్చారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ...ఎవరు కోరితే ఎల్‌వోసీ జారీ చేశారని ఇమ్మిగ్రేషన్ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ... అన్నమయ్య జిల్లా ఎస్పీ, సీఐడీ అదనపు డీజీ కోరిన మీదటే ఎల్‌వోసీ జారీ చేశామని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ...ఎల్‌వోసీ ఎవరు జారీ చేశారు? ఎవరు కోరితే జారీ చేశారు? ఏ కేసులో ఇచ్చారనే విషయంలో స్పష్టత కోసమే కౌంటర్లు వేయాలని డీజీపీ, ఎస్పీలను ఆదేశించామన్నారు.
గత నెల 18న ఆదేశాలు ఇస్తే ఇప్పటివరకు కౌంటర్లు వేయలేదని, కోర్టు ఆదేశాలంటే అధికారులు లెక్కలేనితనంగా చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. డీజీపీయే కౌంటర్ దాఖలు చేయకుంటే ఎస్పీలు కౌంటర్లు వేస్తారని ఎలా ఆశించగలమన్నారు. సీఐడీ వైపు నుండి ఏమైనా ఎల్‌వోసీ జారీ అయ్యిందా అని మరోసారి ఆరా తీశారు. సీఐడీ తరఫున హాజరైన అడిషనల్ పీపీ పాణిని సోమాయజి స్పందిస్తూ....ఎల్‌వోసీ జారీ చేయాలని సీఐడీ కోరలేదన్నారు. దీనిపై ఏఎస్‌జీ చల్లా ధనంజయ స్పందిస్తూసీఐడీ అదనపు డీజీ ఎల్‌వోసీ జారీ చేయాలని కోరారని, అందుకు సంబంధించిన మెయిల్ తమ వద్ద ఉందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ... కౌంటర్లు వేయనందుకు డీజీపీని కోర్టుకు పిలిపించమంటారా అని అడిషనల్ పీపీ సోమయాజిని ప్రశ్నించగా, పిలిపించాలని ఆయన బదులిచ్చారు. దీంతో న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ‘‘గతంలో కోర్టు ఉత్తర్వుల అమలులో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించేవారు. ఇప్పుడు అది లెక్కలేనితనంగా మారింది. లీగల్ టీంలో కొందరు లెక్కలేనితనంగా ప్రవర్తిస్తున్నారు. వారి నుండి ధిక్కారస్వరం వినబడుతోంది. ఇలాంటి వైఖరిని ఉపేక్షించబోం. లీగల్ టీమ్‌లో చాలామంది అప్ టూ మార్క్ పనిచేయడం లేదు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.