Share News

సిట్‌ ఏం చేస్తుందో వేచి చూద్దాం

ABN , Publish Date - Jun 25 , 2026 | 04:02 AM

పోలీసుల కస్టోడియల్‌ టార్చర్‌ కారణంగా విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మృతి చెందాడనే ఆరోపణలతో నమోదైన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ...

సిట్‌ ఏం చేస్తుందో వేచి చూద్దాం

  • సాయికృష్ణ అదృశ్యం కేసులో హైకోర్టు వ్యాఖ్య

  • సీబీఐకి అప్పగించాలన్న పిల్‌పై విచారణ

  • పోలీసు ఉన్నతాధికారులతో సిట్‌ వేశామన్న ఏజీ

  • పిటిషనర్‌కు వైసీపీతో అనుబంధముందని వెల్లడి

  • తదుపరి విచారణ జూలై 6కి వాయిదా

అమరావతి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): పోలీసుల కస్టోడియల్‌ టార్చర్‌ కారణంగా విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మృతి చెందాడనే ఆరోపణలతో నమోదైన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ... కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులతో సిట్‌ ఏర్పాటు చేసిందని, దర్యాప్తు సక్రమంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని నివేదించారు. కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును ఇప్పటికే అరెస్ట్‌ చేశామని, మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరుస్తున్నామని వివరించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... సిట్‌ ఏమి చేస్తుందో కొంతకాలం వేచి చూద్దామని పిటిషనర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. విచారణను జూలై 6కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. పోలీసుల కస్టోడియల్‌ టార్చర్‌ కారణంగా గాదె సాయికృష్ణ మృతి చెందాడనే ఆరోపణలతో నమోదైన కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ కాన్ట్సిట్యూషనల్‌ రైట్స్‌ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ పిల్‌ బుధవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ‘పోలీసులు చిత్రహింసలకు గురిచేయడంతో సాయికృష్ణ మృతి చెందాడు. దీంతో అతని శరీరాన్ని దహనం చేశారు.


సాయికృష్ణ ఆచూకీ కోసం అతని తల్లి హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ విచారణ సమయంలో... సాయికృష్ణ ఆచూకీ గుర్తించలేకున్నామని, అతడిని వెతికి కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని పోలీసులు కోర్టుకు నివేదించారు. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ విచారణకు వచ్చే నాటికే సాయికృష్ణ చనిపోయాడు. ఈ విషయాన్ని దాచిపెట్టి పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించారు. కంటి తుడుపు చర్యగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించింది’ అని వాదించారు. ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ... సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 19న కేసు నమోదు చేశామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐని ఇప్పటికే అరెస్ట్‌ చేశామని వివరించారు. వాస్తవాలను తేల్చేందుకు పోలీసు ఉన్నతాధికారులతో ఈ నెల 21 తేదీన రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిందని తెలిపారు. వారం రోజులు గడవక ముందే సిట్‌పై ఆరోపణలు చేయడం తగదన్నారు. వ్యాజ్యంలో సిట్‌ అధికారులను ప్రతివాదులుగా చేర్చడంపై అభ్యంతరం తెలిపారు. పిటిషనర్‌కు వైసీపీతో అనుబంధం ఉందని, దీనిని వ్యాజ్యంలో ప్రస్తావించకుండా గోప్యంగా ఉంచారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Updated Date - Jun 25 , 2026 | 04:02 AM