ఓఆర్‌ఆర్ నిర్మాణాన్ని నిలువరించలేం
ABN , Publish Date - Apr 16 , 2026 | 06:01 AM
విజయవాడ సౌత్‌ఈస్ట్(ఆగ్నేయం), నార్త్‌ఈస్ట్(ఈశాన్యం) పరిధిలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) అలైన్‌మెంట్ నిర్ణయించే విషయంలో...
పిల్‌ను సదుద్దేశంతోనే వేశారా అనే సందేహం
మౌలిక వసతుల ప్రాజెక్టులపై జోక్యం చేసుకోం
స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం
అమరావతి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): విజయవాడ సౌత్‌ఈస్ట్(ఆగ్నేయం), నార్త్‌ఈస్ట్(ఈశాన్యం) పరిధిలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) అలైన్‌మెంట్ నిర్ణయించే విషయంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు పలు అంశాలను విస్మరించారని పేర్కొంటూ దాఖలైన పిల్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం లేవనెత్తిన పలు సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా అదనపు వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది టి.శ్రీధర్ కోరడంతో... విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.
అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణానికి సంబంధించి విజయవాడ ఆగ్నేయం, ఈశాన్యం పరిధిలో అలైన్‌మెంట్‌ను సవాల్ చేస్తూ కృష్ణాజిల్లా, ఆత్కూర్ గ్రామానికి చెందిన వ్యవసాయదారుడు కన్నిగంటి ఆంజనేయ ప్రసాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎన్‌హెచ్‌ఏఐ తరఫు న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపిస్తూ... అలైన్‌మెంట్‌ను నిపుణుల బృందం ఖరారు చేస్తుందన్నారు. ఇలాంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఓఆర్‌ఆర్ నిర్మాణాన్ని నిలువరించలేమని తేల్చిచెప్పింది. పిటిషనర్ వ్యవసాయదారుడని, ఓఆర్‌ఆర్ ఎక్కడ నిర్మించాలో ఆయన ఎలా నిర్ణయిస్తారని వ్యాఖ్యానించింది. ప్రస్తుత పిల్‌ను సదుద్దేశంతోనే దాఖలు చేశారా అనే సందేహం కలుగుతోందని పేర్కొంది. ప్రస్తుత రోజుల్లో మెజార్టీ ప్రజాహిత వ్యాజ్యాలు రాజకీయ ప్రేరేపితంగా దాఖలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.