Share News

గీతం వర్సిటీ అధీనంలోని..ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి

ABN , Publish Date - May 07 , 2026 | 03:54 AM

విశాఖ జిల్లా రుషికొండ, ఎండాడ గ్రామాల పరిధిలో గీతం యూనివర్సిటీ యాజమాన్యం 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుందని..

గీతం వర్సిటీ అధీనంలోని..ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి

  • అందులోని నిర్మాణాలనూ తొలగించేలా ఆదేశించండి

  • హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు

  • ప్రభుత్వానికి, వర్సిటీ రిజిస్ట్రార్‌కు నోటీసులు

  • కౌంటర్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశం

అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా రుషికొండ, ఎండాడ గ్రామాల పరిధిలో గీతం యూనివర్సిటీ యాజమాన్యం 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుందని.. దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు అందులోని నిర్మాణాలను తొలగించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)లో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు, సీసీఎల్‌ఏ, విశాఖ జిల్లా కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌, వీఎంఆర్‌డీఏ వైస్‌చైర్మన్‌, విశాఖ రూరల్‌ తహశీల్దార్‌, గీతం వర్సిటీ రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేసింది. ఇదే వ్యవహారంపై దాఖలైన రిట్‌ను ప్రస్తుత పిల్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను జూన్‌కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. రుషికొండ, ఎండాడ గ్రామాల పరిధిలో పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల్లో గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (జీఐటీఏఎమ్‌-గీతం) ఆక్రమించుకున్న 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించేందుకు అధికారులు ప్రతిపాదించడాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ కాన్సిస్టిట్యూషనల్‌ రైట్స్‌ అధ్యక్షుడు, గుంటూరుకు చెందిన గోచిపాత శ్రీనివాసరావు వేసిన పిల్‌ బుధవారం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. గీతం వర్సిటీ గతంలో ఈ భూమిని క్రమబద్ధీరించుకునేందుకు ప్రయత్నించి విఫలమైందన్నారు. అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. ఇదే వ్యవహారంపై సింగిల్‌ జడ్జి వద్ద మరో రిట్‌ దాఖలైందని, రెండు వ్యాజ్యాల్లోని అభ్యర్థనలు ఒకేలా ఉన్నాయన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆ రిట్‌ను పిల్‌తో జతచేయాలని ఆదేశిస్తూ.. ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీచేసింది.

Updated Date - May 07 , 2026 | 03:54 AM