Share News

కేసు రికార్డులను థర్డ్‌ పార్టీ కోరలేరు

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:34 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులపై నమోదైన మద్యం పాలసీ కేసు రికార్డులను అందజేయాలంటూ కేసుతో సంబంధం లేని థర్డ్‌ పార్టీ కోరలేరని...

కేసు రికార్డులను థర్డ్‌ పార్టీ కోరలేరు

  • తొలుత వ్యాజ్యం విచారణార్హతను తేల్చండి

  • సీఐడీ తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు

  • హైకోర్టు విచారణ 17వ తేదీకి వాయిదా

అమరావతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులపై నమోదైన మద్యం పాలసీ కేసు రికార్డులను అందజేయాలంటూ కేసుతో సంబంధం లేని థర్డ్‌ పార్టీ కోరలేరని సీఐడీ తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ పేర్కొన్నారు. కేసులో పోలీసులు దాఖలు చేసే చార్జిషీటు, తుది నివేదిక పబ్లిక్‌ డాక్యుమెంట్లు కావన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని గురువారం హైకోర్టుకు నివేదించారు. 2014-19 మధ్య లిక్కర్‌ పాలసీ రూపకల్పనతో ప్రభుత్వ ఖజానాకు నష్టం చేశారని నాటి సీఎం చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర తదితరులపై సీఐడీ నమోదు చేసిన కేసును మూసివేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల సర్టిఫైడ్‌ కాపీ ఇచ్చేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని సవాల్‌ చేసూ దాఖలైన పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. వ్యాజ్యం విచారణార్హతపై మొదట వాదనలు వినాలని కోరారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి.. కేసుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశించారు. తదుపరి విచారణను 17వ తేదీకి వాయిదా వేశారు.

Updated Date - Apr 10 , 2026 | 04:34 AM