కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన..
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:14 AM
ఓ ఆస్తి వివాదంలో కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆదేశాలను అతిక్రమించి కోర్టు నుండి తీసుకున్న ఆస్తి ఒరిజనల్ డాక్యుమెంట్‌ను బ్యాంక్‌లో తాకట్టు పెట్టడం...
సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి హైకోర్టు షాక్
నెల రోజుల సాధారణ జైలుశిక్ష విధింపు
అమరావతి, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): ఓ ఆస్తి వివాదంలో కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆదేశాలను అతిక్రమించి కోర్టు నుండి తీసుకున్న ఆస్తి ఒరిజనల్ డాక్యుమెంట్‌ను బ్యాంక్‌లో తాకట్టు పెట్టడం, ఆ ఆస్తిపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టు ధిక్కరణ కింద నాగతం ముకుందరెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. తనను క్షమించాలన్న ముకుందరెడ్డి అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. క్షమాపణలు చెప్పడం పశ్చాతాపంతో కూడుకున్నదై ఉండాలని, చివరి క్షణంలో చేప్పే క్షమాపణలు అంగీకరించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆస్తి వాటాలకు సంబంధించి తిరుపతికి చెందిన నాగతం సునీత మరో ముగ్గురు.. ముకుందరె డ్డి, తదితరులపై తిరుపతి 5వ అదనపు జిల్లా కోర్టులో 2009లో దావా వేశారు. ఆ ఆస్తిలో 1/4 వంతు పిటిషనర్లకు చెందుతుందని కోర్టు 2017లో ప్రాథమిక డిక్రీ ఇచ్చింది. దీన్ని ము కుందరెడ్డి, నాగతం మునిరాజమ్మ హైకోర్టులో సవాల్ చేశారు. తుది డిక్రీ జారీ చేయవద్దని 2017 డిసెంబరులో తిరుపతి కోర్టును ఆదేశి స్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అప్పీల్ పెండింగ్‌లో ఉండగానే తిరుపతి కోర్టు లో తాము సమర్పించిన ఆస్తి ఒరిజనల్ డాక్యుమెంట్లు వెనక్కి ఇప్పించాలని కోరుతూ ము కుందరెడ్డి అనుబంధ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన ధర్మాసనం.. ముకుందరెడ్డికి ఆ డాక్యుమెంట్లు ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఆస్తిపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం కానీ, తాకట్టు పెట్టడం చేయొద్దని ఆదేశిస్తూ 2021 జూలైలో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ముకుందరెడ్డి ఆస్తి డాక్యుమెంట్లను తిరుపతి కోపరేటివ్ బ్యాంకులో తాకట్టు పెట్టారని, ఆస్తిని రిజిస్టర్డ్ సేల్‌డీడ్ ద్వారా థర్డ్ పార్టీకి విక్రయించారని సునీత, మరికొందరు 2025లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజా గా శిక్ష విధించింది.